
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుమొహం పట్టినా.. భారత్ లో మాత్రం వైరస్ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. దింతో లాక్ డౌన్ ను పొడిగించాలంటూ తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి ఏడు రాష్ర్టాల సీఎంలతోపాటు కొందరు నిఫుణులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై సమాలోచనలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి తుదినిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని పేర్కొన్నాయి.
దేశంలో మార్చి 25న విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్14తో ముగియనున్నది. కాగా, కరోనాపై దీర్ఘకాల పోరాటానికి సిద్ధం కావాలని ఇటీవల ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలిసిపోయామని లేదా ఓడిపోయామని ఎవరూ భావించవద్దన్న ఆయన.. ఈ మహమ్మారిపై దేశం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగి ఉండాలన్నారు. దీంతో లాక్ డౌన్ ను కేంద్రం మరికొంత కాలం కొనసాగించే అవకాశమున్నదన్న ప్రచారం జరుగుతున్నది.
కాగా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ నేతృత్వంలో కేంద్ర మంత్రుల బృందం సమావేశం జరిగింది. మే 15 వరకు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ మూసివేత కొనసాగించాలని, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని ఈ బృందం సూచించింది. కాగా, భారత్‌లో లాక్ డౌన్ వల్ల అసంఘటిత రంగాలకు చెందిన 40 కోట్ల కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది