AP Financial Crisis
AP Financial Crisis: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దొరికిన కాడికి అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐదేళ్లు పాలించమని ఛాన్స్ ఇస్తే మొత్తం నాశనం చేసేసి నాలుగేళ్లకే దివాలా ప్రకటించే పరిస్థితికి తీసుకువచ్చారు. నిధులు లేవు.. ఆదాయం లేదు.. అప్పులు మాత్రం లక్షల కోట్లకు చేరాయి. ఒక పక్క అప్పుల దొరక్క తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో.. కేంద్రం నుంచి ఎంతో కొంత తీసుకురావాలంటూ సిఎస్ నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరోపక్క అధికారంలోకి వచ్చేందుకు చేసిన తప్పులు మెడకు చుట్టుకుంటుండడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఆర్థిక పరిస్థితి అధ్వానంగా..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎప్పుడో చేరిపోయింది రాష్ట్ర ఖజానా. ఏ నెలకు ఆ నెల అప్పులు చేస్తే గాని ఒడ్డెక్కలేని పరిస్థితి. ఈ నెలలో ముందస్తుగా మూడు వేల కోట్లు అప్పు ఆర్బిఐ నుంచి తెచ్చి రెండున్నర వేల కోట్ల వరకు వేస్ అండ్ మీన్స్ వాడేసినా.. ఇప్పటికీ పెన్షనర్లకు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. మరో రూ.500 కోట్ల వరకు బాకీ ఉంది. డబ్బులు లేవనే విద్యా దీవెన వాయిదా వేశామని సిఎస్ కూడా చెబుతున్నారు. ఇటీవల మీట నొక్కిన పథకాలకు నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడం లేదు. దీంతో తమకు రావాల్సిన నిధులు కోసం అంటూ సిఎస్ నేతృత్వంలో అధికారుల బృందం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ అధికారుల బృందం ముందున్న ప్రధాన లక్ష్యం అప్పులకు పర్మిషన్ తెచ్చుకోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇష్టపడని అగ్ర నాయకులు..
మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వస్తే మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఎప్పుడు వచ్చినా ఆయన వ్యక్తిగత అవసరాలు.. లేకపోతే అప్పులే ఎజెండాగా ఉంటున్నాయి. ప్రతి నెలలో ఒకటి రెండు సార్లు వస్తుండడంతో మోడీ, అమిత్ షా కూడా అపాయింట్మెంట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు అన్న ప్రచారం జరుగుతోంది. సీఎం స్థాయిలోనే సాధ్యం కాకపోతే ఇక సిఎస్ చేసేదేమీ లేదు. కేసులు వేగంగా చుట్టూ ముడుతుండడంతో వైసిపికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతోనే సిఎస్ నేతృత్వంలో బృందాన్ని పంపిస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం వచ్చినా ఇప్పట్లో అపాయింట్మెంట్లు కుదరవన్న సమాచారం మోడీ, అమిత్ షా ఆఫీస్ నుంచి రావడంతోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లకుండా సిఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు బృందాన్ని పంపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు వెనుకంజ..
ఒకపక్క రాష్ట్ర ఖజానా ఖాళీగా కాగా.. మరోపక్క పెండింగ్ బిల్లులు ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. వందలాది కోట్ల రూపాయలు బిల్లులు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బిల్లులు తక్షణమే చెల్లించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించాలని పలుమార్లు కోర్టు కూడా ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. పలుచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టర్లు చెప్పులతో కూడా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి వచ్చిందని.. ఇక దివాలా తీయడమే మిగిలిందని.. ఏపీ ప్రభుత్వ వ్యవహారాలపై అవగాహన ఉన్నవారు సెటైర్లు వేస్తున్నారు.
AP Financial Crisis
ఆవేదన వ్యక్తం చేస్తున్న సర్పంచులు..
మరొకపక్క పంచాయతీ నిధులను కూడా ప్రభుత్వం వాడేస్తుంది అంటూ గ్రామ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న వైసీపీకి చెందిన ఓ సర్పంచ్ మీడియా సమక్షంలోనే చెప్పుతో కొట్టుకున్నాడు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేసేందుకు డబ్బులు లేకుండా చేస్తున్నారని, తామెప్పుడూ ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలేదని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Web Title: Ap team to delhi for debts what is the plight
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com