ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగులుతున్న సంగతి తెలిసిందే. హైకోర్టులో పలువురు దాఖలు చేసిన పిటిషన్ల వల్ల ఏపీలో పలు కీలక పథకాల అమలుకు బ్రేక్ పడటంతో పాటు మూడు రాజధానుల అమలు సైతం వాయిదా పడుతోంది. అయితే జగన్ సర్కార్ తాజాగా మరో సంచలనానికి సిద్ధం కావడం గమనార్హం.
ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం నిన్న విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించి హైకోర్టు న్యాయమూర్తుల తీర్పుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఛానెళ్లలో తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆ ప్రచారాన్ని ఖండించాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చానని అజేయ కల్లం వెల్లడించారు. హైకోర్టు జడ్జి జస్టిస్ సోమయాజులు అమరావతి భూ కుంభకోణం జీవోపై స్టే ఇచ్చాడని అజేయ కల్లం అన్నారు.
హైకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్ కేసులో గాగ్ ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్ వీ రమణ ఈ కేసులలో జోక్యం చేసుకుంటున్నారని.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు ఈ విషయం గురించి ప్రభుత్వం ఇప్పటికే ఫిర్యాదు చేసిందని అజేక కల్లం తెలిపారు. హైకోర్టు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అజేయ కల్లం సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఎన్వీ రమణ ఏపీ చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ ను ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. జగన్ సర్కార్ న్యాయమూర్తులపైనే ఈ తరహా ఆరోపణలు చేయడం గురించి రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. జగన్ సర్కార్ న్యాయమూర్తులపై చేసిన ఆరోపణల గురించి ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.