కొన్ని నెలలుగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో తప్పించుకు తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు అటీవీశాఖ అధికారుల వలకు చిక్కింది. రాజేంద్రనగర్‌లో ఐదు నెలల కిందట జనసంచారంలోకి వచ్చి భయాందోళనలకు గురి చేసిన చిరుత అప్పటి నుంచి అప్పుడప్పుడు పశువులపై దాడులు చేస్తూ చంపేస్తుంది. గతంలో రాజేంద్రనగర్ ప్రధాన రోడ్లపై సంచరించింది. ఈ చిరుతను పట్టుకోవడం కోసం అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. శుక్రవారం అర్ధరాత్రి మరోసారి లేగదూడను చంపేసింది. అయితే అంతకుముందు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన బోనులోకి చిరుత రావడంతో అందులో చిక్కింది. దీంతో అటవీశాఖ అధికారులు చిరుతను జూకు తరలించారు. దీంతో రాజేంద్రనగర్‌వాసులు, అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.