ఏపీలో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని సీఎం జగన్ ఆనందంతో చెప్పుకొచ్చారు. ఇవాళ విజయనగరం జిల్లా గుంకాలంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ సభలో జగన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆస్తి, స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం చేపట్టామని.. ప్రతి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
400 ఎకరాల్లో 12301 ఇళ్లను ఇక్కడ నిర్మిస్తున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని జగన్ తెలిపారు. దీన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని తెలిపారు.
అరకోటి మందికిపైగా రైతులకు రైతు భరోసా అందించామన్నారు. 87 లక్షల మందికి పైగా మహిళలకు ఆసరా పథకం ద్వారా మేలు చేస్తున్నట్టు జగన్ వివరించారు. విద్యాకానుక, విద్యావసతి ద్వారా విద్యార్థులకు తోడుగా నిలిచామన్నారు. రైతన్నలకు తోడుగా నిలిచేందుకు పెట్టుబడి రాయితీ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
కోటి 35 లక్షల కుటుంబాలకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మేలు చేస్తున్నామన్నారు. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 30వేల మందికి ఉద్యోగాలిచ్చామని వివరించారు. ఎన్నికల హామీల్లో దాదాపు 95శాతం ఇప్పటికే పూర్తి చేశామని జగన్ వివరించారు.
మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పి.. వాటిని 35 లక్షలకు పైగా పెంచినట్లు జగన్ వివరించారు.