Homeఆంధ్రప్రదేశ్‌YS Viveka Case: వివేక హత్య కేసులో మరో మలుపు

YS Viveka Case: వివేక హత్య కేసులో మరో మలుపు

YS Viveka Case
YS Viveka Case

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో కీలక వ్యక్తిగా సిబిఐ అవినాష్ రెడ్డిని అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసుతో ముడిపడి ఉన్న కీలక వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తోంది సిబిఐ. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా కొద్ది రోజుల కిందట సిబిఐ అధికారులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే, కోర్టుకు వెళ్లిన అవినాష్ కు సానుకూలంగా తీర్పు రావడంతో అరెస్టు ఆలస్యమైంది.

రాష్ట్రంలో కొద్ది రోజులుగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన వార్తలు మినహా.. మరో వార్తకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ కేసు ఎప్పుడు తేలుతుందా..? అని వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రమంతటా ఎదురుచూస్తోంది. ట్విస్టులకు మించిన ట్విస్టులతో ఈ కేసు విచారణ సాగుతోంది. పూటకో కొత్త విషయం ఈ కేసులో వెలుగులోకి వస్తోంది. గత ఆదివారం ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డికి సోదరుడు అయిన భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసు విచారణ దాదాపు కొలిక్కి వచ్చిందని అంతా భావించారు. భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే సిబిఐ అధికారులు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు పంపించారు.

తెలంగాణ హైకోర్టుకు వెళ్లిన అవినాష్ రెడ్డి..

ఈ కేసులో తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత.. అవినాష్ రెడ్డి అప్రమత్తమయ్యారు. తండ్రి అరెస్టు తర్వాత తనకు నోటీసులు పంపించడంతో సిబిఐ అధికారుల అరెస్టు చేస్తారని భావించిన అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలని, ఒకవేళ అరెస్టు చేస్తే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సాగించిన తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ప్రతిరోజు సిబిఐ విచారణకు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి స్పష్టం చేసింది. అవినాష్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఆదేశాలపై.. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. స్టే ఇస్తే అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తుందని ఆయన తరఫున లాయర్లు వాదించారు. దీంతో సోమవారం వరకు అవినాష్ ను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లు అయింది. సోమవారం అన్ని విషయాలను పరిశీలిస్తామని చెప్పిన సుప్రీంకోర్టు విచారణ అప్పటి వరకు కేసు విచారణను వాయిదా వేసింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది.

విచారణకు హాజరవుతున్న అవినాష్ రెడ్డి..

అరెస్టు చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో.. సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి అవినాష్ రెడ్డిని విచారిస్తున్న సిబిఐ అధికారులకు ఆశించిన స్థాయిలో సమాధానాలు లభించకపోవడంతో.. లిఖితపూర్వకంగా సమాధానాలను సిబిఐ అధికారులు తీసుకుంటున్నారు. లిఖిత పూర్వక సమాధానాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తాను చెప్పలేదు.. తాను అనలేదు అనేదానికి అవినాష్ రెడ్డికి అవకాశం లేకుండా పోతుంది. ఆ ఉద్దేశంతోనే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి నుంచి లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నలను సిబిఐ అధికారులు సిద్ధం చేసి అడుగుతున్నట్లు చెబుతున్నారు.

YS Viveka Case
YS Viveka Case

అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా..?

ఇప్పటికిప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు కాకపోయినాప్పటికీ.. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించుకుంటుందన్న విషయం అర్థమవుతుందని పేర్కొంటున్నారు. తాత్కాలికంగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ అవినాష్ రెడ్డికి కలిసి వచ్చిందని, అయితే పూర్తి ఆధారాలతో సిబిఐ అధికారులు కోర్టుకు వెళితే బెయిల్ పిటిషన్ రద్దు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఏం జరుగుతుందన్న విషయం వేచి చూడాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Exit mobile version