AP Ex Minister Anil Kumar: వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి పెట్టని కోటలా ఉంది.2014 ఎన్నికల్లో సైతం మెజార్టీ స్థానాలను అందించింది. గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలను స్వీప్ చేసింది.అంతలా సంస్థాగతంగా వైసీపీ ఈ జిల్లాలో బలంగా ఉంది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు మాత్రం పార్టీకి ఏమంత ఆశాజనకంగా లేవు. పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ తరువాత ముదిరిపాకాన పడ్డాయి. మంత్రివర్గంలో చోటుదక్కలేదని ఒకరు..ఉన్న పదవులు తీసేశారని మరొకరు ..ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. పార్టీని పలుచన చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ మాత్రం ఆత్మకూరు నుంచి గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి, నెల్లూరు సిటీ నుంచి గెలుపొందిన అనిల్ కుమార్ యాదవ్ లకు మంత్రివర్గంలో చోటుకల్పించారు. దీంతో సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్థన్ రెడ్డిలు అసంతృప్తికి గురయ్యారు. అయితే విస్తరణలో చోటు దక్కుతుందని భావించారు. కానీ అనూహ్యంగా గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పొందారు. అటు తరువాత మంత్రివర్గ విస్తరణలో అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించారు. జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాల్సి ఉన్న కాకాని గోవర్థన్ రెడ్డిని విస్తరణలో అవకాశం కల్పించారు. మిగతా వారికి మొండి చేయి చూపారు. దీంతో మంత్రి పదవుల కోసం వేచిచూస్తున్న సీనియర్లలో అసంతృప్తి నెలకొంది. అప్పటి నుంచి జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. గ్రూపుల గోల అధికమైంది.

అదే దూకుడు
అటు మంత్రిగా ఉన్నప్పుడు ఏ దూకుడు ప్రదర్శించారో.. అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు కూడా అదే స్పీడ్ తో వెళుతున్నారు. మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డితో పాటు సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అనిల్ సీఎం జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనిల్ ప్రాధాన్యత పెరిగింది. జిల్లాలో రెడ్డి సామాజికవర్గ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా జగన్ తన కేబినెట్ లోకి అనిల్ ను తీసుకున్నారు. సహజంగా ఇది రెడ్డి సామాజికవర్గ నాయకులు మింగుడుపడలేదు. కాకాని గోవర్థన్ రెడ్డి వారు బాహటంగానే వ్యతిరేకించారు.
Also Read: Krishnashtami 2022: కృష్ణుడి మార్గం ఎందుకు అనుసరణీయం?
ఒకప్పటి తమ ప్రధాన అనుచరుడు తనకు కాదని అమాత్య పదవి లాగేసుకోవడంతో ఆనం రామనారాయణరెడ్డి సైతం దూరం పెట్టారు. దీంతో మంత్రి అనిల్ కుమార్ కు సహాయ నిరాకరణ ఎదురైంది. అయితే అధిష్టానం ఆశీస్సులుండడంతో మంత్రిగా, రాష్ట్ర నాయకుడిగా అనిల్ చలామణి అయ్యారు. అయితే సామాజిక సమతూకాన్ని చూపి జగన్ మంత్రివర్గ విస్తరణలో అనిల్ ను తప్పించారు. అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. అనిల్ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీలో ఉన్న ఆనం అనుచరులు, అటు మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి అనుచరులు యాక్టివ్ అయ్యారు. దీంతో తన వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం అనిల్ ను వెంటాడుతోంది. అందుకే ఆయన వారిద్దరి తీరుపై బాహటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెర వెనుక సొంత పార్టీ వారే ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారని ఆయన ఆరోపణలు చేయడం ప్రారంభించారు. విలేఖర్ల సమావేశంలోనే సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. దీంతో నెల్లూరు వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది.

ఎవరికి వారే యమునా తీరే..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అధిష్టానం తీరుపై అసహనంతో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచినా తగిన ప్రాధాన్యత లేదని అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఎప్పుడు ఏ స్టేట్ మెంట్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రస్తుతానికి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఇక మంత్రి పదవిపై మోజు పెంచుకున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఆ చాన్స్ అందని ద్రాక్షగా ఉంది. అధిష్టానం దృష్టిలో పడాలని ఆయన చంద్రబాబు, లోకేష్ తో పాటు టీడీపీ నాయకులపై వీరవిహారం చేసేవారు. కానీ జగన్ పట్టించుకోకపోవడంతో మనకు వచ్చిన గొడవెందుకని సైలెంట్ అయ్యారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం పార్టీ ఏమంత మోజుతో లేరు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం టిక్కెట్ కేటాయించదేమోనన్న బెంగ ఆయన్ను వెంటాడుతోంది. రెండో భార్యకు టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒక వేళ టిక్కెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు ఆయనకు సోదరుడు రాజమోహన్ రెడ్డితో కూడా విభేదాలున్నాయి. మొత్తానికైతే వైసీపీకి బలమున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విభేదాలుఒక వైపు..ఎవరికి వారే యమునా తీరేనన్న నాయకులు మరోవైపు పార్టీకి కలవరపాటుకు గురిచేస్తున్నారు.
Also Read:Janasena Chief Pawan Kalyan: ఆ తొమ్మిది మందిపైనే.. పవన్ టార్గెట్ ఫిక్స్