Uniform Civil Code
Uniform Civil Code: భారతదేశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనేది కచ్చితంగా వినిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ల నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత.. పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన తర్వాత.. అనేక యుద్ధాలు చేసిన తర్వాత.. భారత్ ఇవాళ ఈ స్థాయిలో నిలబడగలిగింది అంటే దానికి కారణం ఈ దేశానికి ఉన్న ప్రత్యేకత. ఇన్ని మతాలు, ఇన్ని జాతుల మనుషులు, ఇన్ని రకాల సాంస్కృతిక వారసత్వాలు కలిసి ఉంటున్నాయి అంటే దానికి కారణం ఈ నేలకు ఉన్న గొప్పతనమే. అయితే అందరం ఒక్కలాగా ఉండాలి.. ఒకే విధంగా జీవించగలగాలి అనే ప్రస్తావన ఇప్పుడు వస్తోంది. దీని గురించి స్థూలంగా చెప్పాలంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి లేదా కామన్ సివిల్ కోడ్ బిల్లును తెరపైకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కారణాలు ఎలాంటివి ఉన్నప్పటికీ దేశం మొత్తాన్ని ఏకతాటి పైకి తేవాలి అనేది తమ లక్ష్యం అనే విధంగా కేంద్ర ప్రభుత్వం “వన్ నేషన్ వన్ ఎజెండా” అనే దానిని తెరపైకి తీసుకొస్తుంది. వచ్చే ఎన్నికలకు ముందు దీనిని అమల్లోకి తేవాలని భావిస్తున్నది. దీనిపైన ఇటీవల ప్రధానమంత్రి భోపాల్ లో నిర్వహించిన ఒక సభలో కుండబద్దలు కొట్టారు. వేరువేరు చట్టాలతో దేశం ఎలా అపసవ్య దిశలో నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ 70 సంవత్సరాలుగా దేశం కొన్ని కొన్ని సమస్యలు మినహా సవ్యంగానే నడుస్తోంది. అలా అని ఈ ఒకే దేశం ఒకే చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకించగలమా అంటే.. దాని వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయని ఒక వర్గం చెబుతోంది.
ఇక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నినాదాలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్న ప్రధాని.. సంఘ్ మది లో ఉన్న వన్ నేషన్ వన్ లా ను అమల్లో పెట్టేందుకు సన్నహాలు చేస్తున్నారు. వాస్తవంగా దీనిని భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిసారి పెడుతూనే ఉంది. 9 సంవత్సరాలుగా దీనిపై చర్చ సాగిస్తూనే ఉంది. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక దేశంలో ఒకే విధమైన చట్టం ఉండాలి, భిన్నమైన చట్టాలు ఎందుకు అనేది బిజెపి వాదన. ఈ ఏడాది ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ వాదనను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఉమ్మడి పౌర స్మృతిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని లా కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. ఉమ్మడి పవర్ స్మృతి ఈ దశలో అవసరం లేదని వాంఛనీయం కూడా కాదని స్పష్టంగా చెబుతూ 2018లో 21వ లా కమిషన్ ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఈ అభిప్రాయాలు ఇష్టం లేకపోవడం వల్లే మళ్లీ సొంత ఏజెండాతో కేంద్రం ఈ విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తనకు పూర్తి మెజార్టీ రావడంతో నరేంద్ర మోడీ తన పార్టీ ఏ జెండాలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు రావడంతో అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని వేగంగా చేస్తున్నారు. దీనిని మతపరమైన వివాదం గా కాకుండా, స్థలపరమైన విషయంగా పరిగణించి కోర్టు ఈ వివాదాన్ని పరిష్కరించింది. రామ మందిరం స్థలానికి బదులుగా ముస్లింలు మసీదు కట్టుకునేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని హిందువులు ఇచ్చే విధంగా పరిష్కారం కుదిరింది. అలాగే తలాక్ సమస్యను స్త్రీ, మధ్య సమానత్వ భావన ప్రాతిపదికగా అప్పటికప్పుడు ముమ్మారు తలాక్ చెప్పే విధానాన్ని రద్దు చేశారు. ఈజిప్ట్ వంటి ముస్లిం దేశం ఎప్పుడో ముమ్మారు తలాక్ విధానాన్ని ఎప్పుడు దశాబ్దాల కిందటే రద్దుచేసిందని బిజెపి చెబుతూనే ఉంది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి సమస్యను పరిష్కరించేందుకు నెమ్మదిగా పావులు కలుపుతోంది.
ఇక ప్రధాని నోటి వెంట భోపాల్ సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతి మాట రావడం యాదృచ్ఛికం కాదు. దేశంలో పలు అంశాలకు సంబంధించి అందరికీ ఒకే చట్టం లేదు. ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలు దేశంలో అమలవుతున్నాయి. ముఖ్యంగా హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి. త్రిబుల్ తలాక్ వంటివివాదాలు ఈ కారణంగానే వస్తున్నాయి. దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవన భృతికి సంబంధించిన విషయాలు అందరికీ ఒకే విధంగా లేవు. పౌరులు ఆచరించే మతం, విశ్వాసాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కో విధంగా ఉంది. అయితే మతంతో సంబంధం లేకుండా, లింగ విభేదాలు లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింప చేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్ ముఖ్య ఉద్దేశం.. యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే మతలపరంగా ఎవరికి వారు అమలు చేసుకునే చట్టాలు చెల్లవు. పెళ్లి, దత్తత, వారసత్వ హక్కుల్లో ఏకరూపత కార్యరూపం దాల్చుతుంది. దేశవాసులందరికీ ఒకే రాజ్యాంగం వర్తిస్తుంది కనుక ఏ మతం వారికైనా ఒకే వివాహ చట్టం వర్తిస్తుంది.
భిన్నత్వంలో ఏకత్వం లాంటి భారత వైవిధ్య భరితమైన సంస్కృతిని దెబ్బతీయడం మంచిది కాదనే ఉద్దేశంతోనే ఇలాంటి పౌర స్మృతిని తెరపైకి తీసుకురాలేదు. రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు మనం అనుచరించాల్సిన ఆదేశాలు మాత్రమే నిర్దేశిస్తాయి. అందులో పేర్కొన్న ప్రతి అంశాన్ని చట్ట రూపంలో తీసుకురావాలని ఎట్టి పరిస్థితిలో చెప్పవు. ఒకవేళ అలా చెప్పవలసిన అవసరం ఉంటే రాజ్యాంగ రూపొందించే సమయంలోనే ఉమ్మడి పౌర స్మృతి రాజ్యాంగంలో భాగమై ఉండేది. ఇక వివిధ రకాల మతాలను ఆచరించేవారు.. తమ మత ఆచారాలకు అనుగుణంగా సంప్రదాయాలు పాటిస్తున్నారు. ముస్లింలోనూ షరియా చట్టాలను పాటించని వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలు రూపొందించుకున్నాయి. క్యాథలిక్స్, ఇతర మతస్తులకు భిన్నమైన నియమాలు ఉన్నాయి. హిందువుల్లో కొడుకులతో సమానంగా కూతుళ్ళకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాల సవరించారు. దీనికంటే ముందే ఐదు రాష్ట్రాలు మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటాహకుని కల్పిస్తూ చట్టాలు చేశాయి. ఉమ్మడి పౌరస్మృతిని కేవలం ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిని మిగతా మతస్తులు కూడా తప్పుపడుతున్నారని తెలుస్తోంది. అయితే బిజెపి విధానాల ప్రకారం ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్ గానే యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తున్నారనే అభిప్రాయాలు వ్యాప్తిలో ఉన్నాయి. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేదే బిజెపి నాయకుల వాదన. ఇందుకు ఇస్లాం మతంలో ముమ్మారు తలాక్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే ఉమ్మడి పౌరస్మృతి డిమాండ్ ఈనాటిది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా ఇదే చెప్తోంది. మరి దీనిని అనుసరించి మోడీ మాట్లాడుతున్నారు. ఎన్నికలవేళ దీనిని అమల్లోకి తెస్తామని చెబుతున్నారు. దీనిపై మిగతా పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Analysis on uniform civil code of india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com