KCR and Jagan friendship: కొన్ని రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటాయి. గతంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాలకులు పరస్పర రాజకీయ ప్రయోజనం చేకూర్చుకునేవారు. కానీ రాష్ట్రాల విషయంలో మాత్రం తాము రాజీలేని విధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చేవారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు.. నాగార్జునసాగర్ వద్ద ఏపీ పోలీసుల హడావిడి దేనికి సంకేతం. కేవలం తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ను గెలిపించుకునేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించుకునేందుకుగాను.. జగన్ ఆశ్చర్యలకు దిగారు అన్నది బహిరంగ రహస్యం. అయితే ప్రజలకు ఏమీ తెలియదని భావించడం మూర్ఖత్వమే అవుతుంది. గతంలో జగన్, కెసిఆర్ మధ్య స్నేహం రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు పనికి వచ్చిందా?.. లేకుంటే ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య సాన్నిహిత్యం బాగా పనిచేస్తుందా అన్నది ప్రజలు గుర్తిస్తున్నారు. నిన్ననే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీకి వచ్చి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం ఇచ్చారు. తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని కోరారు. అయితే ఐదేళ్ల వైసిపి పాలనలో కానీ.. కెసిఆర్ పాలనలో కాని ఇటువంటి పరిస్థితి రెండు రాష్ట్రాల మధ్య ఉండేదా? అనేది చర్చ అయితే ఒకటి నడుస్తోంది..
తరచూ కలయిక..
అయితే ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తో పాటు కెసిఆర్ తరచూ కలుసుకునేవారు. విశాఖలో శారదాపీఠంలో యాగాలు జరిగితే ఇద్దరూ హాజరయ్యేవారు. అయితే ఆ స్వామీజీని కలిపింది మాత్రం కెసిఆర్. రాజకీయంగా యాగాలు కలిసి రావడంతో దానిని కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్తే కేసిఆర్ తో విందు రాజకీయం చేసేవారు. ఆ కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డిని ఎంతో గౌరవించి ఆత్మీయ సత్కారం చేసి పంపించేది. కెసిఆర్ ఏపీ వచ్చినా అంతే. అయితే ఈ ఇద్దరు నేతలు రెండు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాల కోసం ఎటువంటి చర్చలు జరిపేవారు కాదు. పెట్టుబడుల సదస్సులు నిర్వహించిన దాఖలాలు లేవు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా కార్యాచరణ చేసిన దాఖలాలు లేవు.
విరుద్ధ ప్రభుత్వాలు అయినా..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రెండు రాజకీయ విరుద్ధ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ సన్నిహితుడు. కానీ రేవంత్ సర్కార్ లో ఉన్న మంత్రులు రాజశేఖర్ రెడ్డి ఆత్మీయులు. ఆపై జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు కూడా. అందులో ఒకరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీకి వచ్చి చంద్రబాబుకు ఆహ్వానం ఇచ్చి వెళ్లారు. చంద్రబాబుది గొప్ప విజన్ గా పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్లక పోవడాన్ని తప్పుపట్టారు. ఒక్క కోమటిరెడ్డి కాదు క్యాబినెట్లో ఉన్న చాలామంది రాజశేఖరరెడ్డికి సన్నిహితులు. మల్లు భట్టి విక్రమార్క,, పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి, కొండా సురేఖ.. ఇలా చాలామంది సన్నిహితులు ఉన్నారు. అయితే కెసిఆర్ హయాంలో ఆయనతో స్నేహం చేసిన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి సన్నిహితులను పట్టించుకోలేదు. ఆపై ఏపీ ప్రయోజనాలను పట్టించుకోలేదు. అటు కెసిఆర్ సైతం ఈ విషయంలో తన సొంత రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోలేదు. వారి స్నేహం రాజకీయంగా కొనసాగగా.. ప్రస్తుత ముఖ్యమంత్రిల స్నేహం రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ సాగుతోంది.