National Leader: జాతీయ రాజకీయాల్లో రాణించాలని, గుర్తింపు సాధించాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందులో సక్సెస్ అయ్యేది కొందరే. సాధారణంగా రాష్ట్రాల్లో రాజకీయం చేసేవారు కేంద్ర రాజకీయాలకు ఇష్టపడరు. కానీ తెలంగాణలో కేసీఆర్ వంటి వారు దేశ ప్రధాని అయిపోవాలని కలగన్నారు. చంద్రబాబు కంటే తన ఇమేజ్ ఎక్కువని భ్రమపడ్డారు. అయితే ఇలా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి గర్జించాలనుకున్న ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పెట్టేశారు. కుమార్తెను కేంద్రమంత్రిగా చేసే అవకాశం వచ్చింది కానీ.. అదే కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వారు. ఆమె జైలు జీవితానికి కారణం అయ్యారు. జైలు నుంచి వచ్చిన ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు.
చంద్రబాబుకు ఇప్పుడే కాదు చాలాసార్లు జాతీయ రాజకీయాల్లో అవకాశం వచ్చింది. కానీ ఆయన మాత్రం రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని ఆసక్తి చూపారు. ఉమ్మడి ఏపీ లోను, నవ్యాంధ్రప్రదేశ్ లోను రాష్ట్రం మాత్రమే అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు. దేశ రాజకీయాల విషయంలో భ్రమ పడలేదు. 2018లో మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో సైతం తానేదో ఈ దేశానికి ప్రధాని అయిపోతానని చెప్పలేదు. ఏపీకి తగు రీతిలో న్యాయం జరగలేదని మాత్రమే ఎదురు తిరిగారు. చంద్రబాబు ఎన్నడు నేల విడిచి సాము చేయలేదు. వాస్తవాన్ని గుర్తించి మాత్రమే రాజకీయాలు చేశారు.
ప్రస్తుతం ఆ ముగ్గురు చుట్టే..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అంటే చంద్రబాబు, రేవంత్, కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి చుట్టూ నడిచాయి. ఇందులో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి. ఆయన విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయస్థాయిలో తమ పార్టీ వ్యవహారాలను చూసుకుంటుంది కాబట్టి. 2019లో బిజెపి పరోక్ష సహకారంతో అధికారంలోకి వచ్చారు జగన్. ఒకటి కాదు రెండు కాదు 22 ఎంపీ స్థానాలతో మంచి విజయం సాధించారు. బిజెపికి పరోక్షంగా సహకారం అందించారు. బిజెపి సహకారాన్ని తీసుకున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. ఒకరిద్దరు ఎంపీలు తప్ప అందరూ డమ్మీలే. కెసిఆర్ పరిస్థితి కూడా అదే. తనను తాను రాజుగా ప్రకటించుకున్నారు. ఇతర రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలను శత్రువులుగా మార్చుకున్నారు.
ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేకం
కానీ చంద్రబాబు అలా కాదు. జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకునే ప్రయత్నం చేశారే తప్ప.. తానే కింగ్ అని భావించలేదు. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జిఎంసి బాలయోగిని లోక్సభ స్పీకర్ గా ఎంపిక చేయడంలో చంద్రబాబు కృషి ఉంది. ఒక ఎర్రం నాయుడు, ఒక అశోక్ గజపతి రాజు,, ఓ సుజనా చౌదరి, ఓ రామ్మోహన్ నాయుడు, ఓ పెమ్మసాని చంద్రశేఖర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కేంద్రమంత్రులు అయ్యారు టిడిపి హయాంలో. కానీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలతో సఖ్యత ఏర్పరచుకున్నారే తప్ప.. ఒక్కరంటే ఒక్కరికి రాజకీయ ప్రయోజనాలు కల్పించారా? కెసిఆర్ పరిస్థితి కూడా అదే. తాను ఒక సీనియర్ అని ఎక్కువగా విర్రవీగుతుంటారు. జాతీయస్థాయిలో ముద్రచాటి ఈ దేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కన్నారు. సొంత కుమార్తెకు కేంద్రమంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్న.. పొందలేకపోయారు కేసీఆర్. ఇలా ఎలా చూసుకున్నా కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు జాతీయ స్థాయిలో బలమైన ఉనికి చాటుకున్న వారే.