Kangana Ranaut : కంగనాను కొడితే ఊరుకుంటుందా.. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కు కోలుకోలేని షాక్..

Kangana Ranaut అయితే దీనిని కంగనా అంత తేలిగ్గా విడిచిపెట్టదని.. ఏదో ఒక రూపంలో తెరపైకి తెస్తూనే ఉంటుందని ఆమె గురించి తెలిసినవారంటున్నారు. మరి ఈ వివాదాన్ని కంగనా తనకు అనుకూలంగా ఎలా మలచుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Written By: NARESH, Updated On : June 7, 2024 10:56 pm

An irreparable shock to the CISF constable who hit Kangana Ranaut

Follow us on

Kangana Ranaut : అసలే ఆమె కంగనా రనౌత్. ఓ తిక్క కేసు. ఏం మాట్లాడుతుందో.. ఎలా ఉంటుందో ఆమెకే తెలియదు. అలాంటి ఆ హీరోయిన్ బిజెపి లో చేరి ఎంపీగా గెలిచింది. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆమె ఇటీవల ఓ విమానాశ్రయంలోకి వెళ్తుంటే అక్కడ ఏదో గొడవ జరిగింది. దీంతో ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆమెను చెంప దెబ్బ కొట్టింది. ఇంకేముంది దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. మీడియా, సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. ఈ విషయాన్ని కంగనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరింత రచ్చ రచ్చ చేసింది.. అక్కడితోనే కంగనా ఊరుకునే రకం కాదు కదా.. మరింత లోతుల్లోకి వెళ్ళింది. తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాల్సిందే అని భావించింది. అంతే ఆ దాడికి పాల్పడిన కానిస్టేబుల్ కు కోలుకోలేని షాక్ తగిలింది.

మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత.. గురువారం కంగనా చండీగఢ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లేందుకు బయలుదేరింది.. అయితే అనుకోకుండా విమానాశ్రయంలో జరిగిన ఘటనతో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంప దెబ్బ కొట్టింది. దీంతో ఈ విషయాన్ని కంగనా రచ్చ రచ్చ చేసింది. ఫలితంగా మరుసటి రోజు కుల్విందర్ పై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. సెక్షన్ 323 (దాడి), 341 (బలవంతమైన నిర్బంధం) కింద ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు..

వాస్తవానికి ఈ గొడవకు ప్రధాన కారణం ఏంటంటే.. ఆ మధ్య ఢిల్లీలో రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. వాటిని బిజెపి నాయకులు ఖండించారు. ఈ క్రమంలో కంగనా కూడా ఆందోళనలను ఉద్దేశించి మాట్లాడారు. ” రైతులు పిలుపునిచ్చిన నిరసనలో పాల్గొన్న మహిళలకు ఒక్కొక్కరికి 100 రూపాయలు చెల్లించారని” కంగన అప్పట్లో అన్నారు. అయితే ఈ ఆందోళనలో కుల్విందర్ తల్లి కూడా ఉన్నారు.

కంగనా అప్పట్లో చేసిన వ్యాఖ్యల పట్ల కుల్విందర్ కు ఒళ్ళు మండిపోయింది. దీనికి సరైన స్థాయిలో సమాధానం చెప్పాలని ఎప్పటినుంచో ఆమె వేచి చూస్తోంది. ఈ దశలో ఆమె విధులు నిర్వహిస్తున్న చండీగఢ్ విమానాశ్రయంలో కంగన కనిపించింది.. ఈ క్రమంలో కంగనా తనిఖీలు పూర్తయిన తర్వాత.. ఆమెను వేచి ఉండాలని కుల్విందర్ కోరింది. ఆ తర్వాత నిశ్శబ్దంగా వెనుక నుంచి వచ్చి ఆమె చెంపపై ఒక దెబ్బ కొట్టింది.. ఈ ఘటన తర్వాత.. తనపై జరిగిన దాడికి.. ఖలిస్థాన్ ఉగ్రవాదానికి సంబంధం ఉందని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియో కూడా విడుదల చేసింది. ” అప్పట్లో సొంత సెక్యూరిటీ గార్డులు ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీని ఏం చేశారో అందరికీ తెలుసు. చండీగఢ్ లో నాకు ఎదురైన పరిస్థితి కూడా అలానే ఉందని” కంగనా వ్యాఖ్యానించారు..

కానిస్టేబుల్ తనపై దాడి చేయడం రాజకీయ చర్యల ప్రేరేపితమని ఆమె మండిపడ్డారు.. తనపై దాడి చేస్తున్నప్పుడు.. ఆ సంఘటనను రికార్డ్ చేస్తున్న ఇతర ప్రయాణికులను కుల్విందర్ భయపెట్టిందని.. వారి దృష్టిని మళ్లించిందని కంగనా ఆరోపించింది. మొత్తానికి ఈ దాడి ఎపిసోడ్.. కుల్విందర్ పై చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతానికైతే సద్దుమణిగినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే దీనిని కంగనా అంత తేలిగ్గా విడిచిపెట్టదని.. ఏదో ఒక రూపంలో తెరపైకి తెస్తూనే ఉంటుందని ఆమె గురించి తెలిసినవారంటున్నారు. మరి ఈ వివాదాన్ని కంగనా తనకు అనుకూలంగా ఎలా మలచుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.