RBI Interest rates : వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఒక్కసారిగా దూసుకుపోయిన మార్కెట్..

ఆర్బీఐ రెపో రేట్లను యథాతధంగా ఉంచడం సహా.. వృద్ధి రేటుపై అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ భారీగా దూసుకుపోతున్నాయి.

Written By: NARESH, Updated On : June 7, 2024 10:58 pm

RBI Interest rates :

Follow us on

RBI Interest rates : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం (జూన్ 06) కీలక ప్రకటన వెలువరించింది. కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతధంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. రెపో రేటు 6.50 వద్దే స్థిరంగా ఉంచింది. ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం ఇది వరుసగా 8వ సారి. బుధవారం (జూన్ 5) ప్రారంభమైన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ఇంధన ధరల్లో ద్రవ్యోల్బణం నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. అయినా ధరల పెరుగుదలపై ఎంపీసీ అప్రమత్తంగానే ఉందని వెల్లడించారు. వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతుల్యత అనుకూలంగానే ఉందన్నారు. అయితే, ఆహార ద్రవ్యోల్బణం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుందన్నారు గవర్నర్. దీన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ద్రవ్యోల్బణాన్ని 4 శాతంలోపలికి తీసుకొచ్చే లక్ష్యానికి ఆర్బీఐ కట్టుబడి ఉందని శక్తికాంత దాస్ వెల్లడించారు. నైరుతి రుతు పవనాల కారణంగా ఖరీఫ్ సాగు పెరిగి ఉత్పత్తి పెరుగుతుందన్న ఆయన రుతుపవనాలతో రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరుగి రబీకి కూడా ఉత్పత్తి పెరగవచ్చన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు అంచనా 7.5 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. ఇది కార్యరూపం దాలిస్తే వరుసగా నాలుగో సంవత్సరం 7 శాతం పైనే వృద్ధి నమోదైనట్లు అని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం పూర్తి ఆర్థిక సంవత్సరానికి 4.5 శాతంగా అంచనా వేయగా.. వరుస త్రైమాసికాల్లో 4.9 శాతం, 3.8 శాతం, 4.6 శాతం, 4.5 శాతంగా అంచనా వేసింది.

ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయిని స్థిరత్వం దేశ దృఢమైన ఆర్థిక పునాదులకు నిదర్శనం అని శక్తికాంత దాస్ చెప్పారు. దీంతో 2023-24 వార్షిక ఫలితాలను చూస్తుంటే బ్యాంకింగ్ రంగం ఎంత బలోపేతంగా ఉందో తెలుస్తుందన్నారు. కస్టమర్ల భద్రతకే తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు గవర్నర్. వినియోగదారులకు తెలియకుండా చాలా సంస్థలు కొన్ని రకాలు రుసుములు వసూలు చేస్తున్నట్లు ఆందోళన తెలిపారు. ఎఫ్‌డీఐలు బలంగా కొనసాగుతున్నాయని.. నికర ప్రాతిపదికన చూస్తే మాత్రం కొంత తగ్గుదల నమోదైందని చెప్పారు. అసురక్షిత లోన్ల జారీని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు..
ఆర్బీఐ రెపో రేట్లను యథాతధంగా ఉంచడం సహా.. వృద్ధి రేటుపై అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ భారీగా దూసుకుపోతున్నాయి.