కరోనాకు అల్లోపతి వైద్యం పనిచేయకపోవడం వల్లనే లక్షలాది మంది చనిపోతున్నారని రామ్ దేవ్ వ్యాఖ్యానించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘‘అల్లోపతి ఒక కుంటి శాస్త్రం. మొదట హైడ్రాక్సీ క్లోరోక్విన్ విఫలమైంది. ఇప్పుడు రెమ్ డెసివర్ వంటివి కూడా ఫెయిలయ్యాయి. యాంటీ బయాటిక్స్ సైతం విఫలమయ్యాయి. ఆక్సీజన్‌కొరతకన్నా.. ఈ మందుల వల్లనే లక్షలాది మంది చనిపోయారు’’అని ఆ వీడియోలో అన్నారు.
దీంతో.. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయనకు లీగల్ నోటీసులు పంపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ కూడా నోటీసులు ఇచ్చింది. అటు కేంద్రం ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లోపతి వైద్యంపై రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సరికావని అన్నారు. కొన్ని లక్షల మంది వైద్య సిబ్బంది మనోభావాలను గాయపరిచారని అన్నారు. ఎంతో మంది వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కరోనా రోగులకు సేవ చేస్తుంటే.. రామ్ దేవ్ ఈ తీరుగా మాట్లాడంపై మండిపడ్డారు. రామ్ దేవ్ లాంటి వ్యక్తి ఇంత మందిని బాధించేలా మాట్లాడి.. కంటితుడుపు చర్యగా సారీ చెబితే సరిపోదని అన్నారు.
కాగా.. ఆయన వ్యాఖ్యలు దుమారం లేపడంతో.. సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు రామ్ దేవ్. ఎవరి మనసులనైనా కష్టపెడితే క్షమించాలని ట్విటర్ పేజీలో రాసుకొచ్చారు.