
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద కరోనా నివారణ మందులో మ్యాటర్ ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ఆయుష్ అధికారులు పరిశీలించి ఇది హానికరం కాదని తేల్చారు. నాటు మందుగా అభివర్ణించారు. కానీ కరోనాపై పనిచేస్తోందని తెలిపారు.
ఇప్పుడు కేంద్రప్రభుత్వంలోనూ దీనిపై కదలిక రావడం విశేషం. ఆనందయ్య ఆయుర్వేద మందు పనితీరుపై తాజాగా జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్ఎఎస్) పరిశోధన ప్రారంభించింది. మొత్తం 4 దశల్లో ఈ మందును విశ్లేషించనుంది.
మొదటి దశలో ఈ మందు తీసుకున్న వారి అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించాలని విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిని కేంద్రం సీసీఆర్ఎఎస్ ఆదేశించింది. వారు ఇప్పటికే ఆయుర్వేద మందు తీసుకున్న 500 మంది అభిప్రాయాలు తీసుకొని నివేదికను రెడీ చేస్తున్నారు.
ఇక రెండో దశలో కరోనా మందు పరిస్థితులు, ఔషధాలు, మూలికలను పరిశీలించనున్నారు. తర్వాత ఈ మందు కరోనా రోగులపై ఎంత మేరకు పనిచేస్తుందనే వివరాలను సేకరించనున్నారు. రెండు రోజుల్లోనే దీన్ని పూర్తి చేయాలని ఆయుర్వేదవైద్యులను జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆదేశించింది.
అయితే ఆనందయ్య కరోనా మందు ప్రభావం విశ్లేషణ ద్వారా ఇది పనిచేస్తోందని కేంద్రం ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. పూర్తి స్థాయి పరిశోధనలకు 4 నుంచి 5 వారాలు పడుతుందని.. ఆ తర్వాత పనిచేస్తే కేంద్రమే ఈ మందు తయారీ అంశాన్ని పరిశీలిస్తుందని అంటున్నారు.