
Taliban Warns America: ఓవైపు అగ్రరాజ్యం అమెరికా.. మరోవైపు కరుడుగట్టిన తాలిబన్లు.. ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి.. అంటే ఖచ్చితంగా ఇప్పుడు తాలిబన్లదే అని చెప్పక తప్పదు. నిన్ననే తాలిబన్లు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు పంపారు. 31లోపు తమ దేశం నుంచి ఖాళీ చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
అయితే అగ్రరాజ్యంనే బెదిరించిన తాలిబన్లకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గట్టి బదులిస్తారని అందరూ అనుకున్నారు. అమెరికా మిత్రపక్షాలైన బ్రిటన్ సహా పలు దేశాలు కూడా ఆగస్టు 31 గడువు పొడిగించాలని.. తమ బలగాలను అక్కడే ఉంచాలని కోరారు. కానీ జోబైడెన్ మాత్రం తాలిబన్లు విధించిన గడువు ఆగస్టు 31లోపు ఖాళీ కావాలని డిసైడ్ అయ్యారు.
కాబూల్లోని తాలిబన్ రాజకీయ విభాగం అగ్రనేత అబ్దుల్ ఘనీ బరాదర్ తో అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ విలియం జె బర్న్స్ తాజాగా రహస్యంగా భేటి అయినట్టు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాతనే జోబైడెన్ ఈ ప్రకటన చేశారు. ఆగస్టు 31లోపు వేగంగా విదేశీయులను, తమ వారిని తరలిస్తామని.. అప్ఘనిస్తాన్ ను ఖాళీ చేస్తామని ప్రకటించారు. ముందుగా నిర్ధేశించినట్టే అప్ఘన్ నుంచి తమ బలగాలు, పౌరులు, శరణార్థుల తరలింపు తుది గడువుపై నెలకొన్న ఉత్కంఠకు ముగింపు పలుకుతూ 31 కల్లా తమ వారందరినీ తీసుకెళ్లాలని నిర్ణయించారు. గడువు పొడిగించేది లేదన్నారు.
ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయంలో అమెరికా సైనికులు 5800 మంది విధులు నిర్వహిస్తున్నారని అమెరికా జాతీయ భద్రత సలహాదారు తెలిపారు. ఈ క్రమంలోనే 31 తర్వాత అప్ఘన్ లో తమ బలగాలను ఉంచితే దారుణ పరిస్థితులు ఎదరయ్యే అవకాశాలున్నాయని అమెరికా భావిస్తోంది. 31లోపు వీలైనంత వేగంగా అందరినీ అప్ఘన్ నుంచి తరలించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమెరికా, దాని మిత్రపక్షాలు సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో ఏకంగా 21600 మందిని కాబూల్ నుంచి తరలించాయి.