https://oktelugu.com/

West Bengal : మమతా పాలనలో అంతే.. ఇలానే కొట్టి చంపుతారు.. వైరల్ వీడియో

West Bengal : ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ ఖాళీ అనే గ్రామంలో అక్కడి అధికార పార్టీ నాయకుడు షాజహాన్ షేక్ మహిళలను లైంగికంగా వేధించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 30, 2024 / 09:22 PM IST

    West Bengal

    Follow us on

    West Bengal : పశ్చిమ బెంగాల్.. సుందర్ బన్ అడవులకు పేరు పొందిన ఈ రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు కొదవ ఉండదు. గతంలో కమ్యూనిస్టులు పరిపాలించినప్పుడు హింస పెచ్చరిల్లేది. నందిగ్రామ్ నుంచి మొదలు పెడితే కోల్ కతా వరకు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో, ఎవరో ఒకరిపై దాడులు జరుగుతుండేవి.. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. తృణ మూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మాత్రమే మారింది. హింస అంతకు మించి అనేలాగా రూపాంతరం చెందింది. ఇటీవల ఎన్నికల్లో అక్కడి అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తలపై చేసిన దాడులే ఇందుకు సజీవ ఉదాహరణ. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ ఏదో ఒకచోట దాడులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోలీసులు, భారీగా యంత్రాంగం ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.

    నడిరోడ్డుపై.. చుట్టూ జనం ఉండగా.. ఓ మహిళ, మరో పురుషుడిని.. ఓ వ్యక్తి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. చుట్టూ జనం ఉన్నప్పటికీ అతడిని వారించలేకపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. ఆ మహిళను, అ పురుషుడిని ఆ వ్యక్తి పశువుల కంటే హీనంగా కొడుతున్నప్పటికీ.. మిగతా వ్యక్తులు ఎవరూ పట్టించుకోక పోవడం విశేషం. దీనిపై ప్రతిపక్ష బిజెపి, సిపిఎం నాయకులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ స్థాయిలో శాంతిభద్రతలు అదుపుతప్పుతుంటే ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

    సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆ సంఘటన ఉత్తర బెంగాల్లోని ఉత్తర్ దీనాజ్ పూర్ జిల్లాలోని చోప్రా ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు అక్కడ సమూహంగా ఉండగా.. ఓ మహిళ, మరో పురుషుడిని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా కొట్టాడు. అతడు ఇష్టం వచ్చినట్టు కొట్టిన దెబ్బలకు తర్ర కూడా విరిగిపోయింది. కళ్ళ ముందు ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ అక్కడి వారెవరు కూడా అతడిని వారించలేకపోయారు. ఒకానొక దశలో ఆ వ్యక్తి ఆ మహిళను జుట్టు పట్టుకుని ఎక్కడపడితే అక్కడ తన్నాడు. అతడు కొట్టిన దెబ్బలకు ఆ మహిళ పడిపోయింది. అయితే ఆ వ్యక్తి వారిద్దరినీ ఎందుకు కొట్టాడనేది ఇంతవరకు తెలియ రాలేదు. అయితే వివాహేతర సంబంధం కారణంగానే ఆ వ్యక్తి వారిద్దరిపై భౌతిక దాడికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని వారు అంటున్నారు. అయితే ఈ సంఘటన పై ఇంతవరకు అధికార పార్టీ నాయకులు స్పందించలేదు.

    మరోవైపు ఈ దారుణ ఘటనపై బిజెపి నాయకులు స్పందించారు. “బెంగాల్ రాష్ట్రం అనేది మమతా బెనర్జీ సొంత అడ్డా లాగా మారిపోయింది. ఇక్కడ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ రాష్ట్రంలో అమలవుతున్న చట్టాల గురించి మిగతా ప్రాంతాల ప్రజలు తెలుసుకోవాలంటే ఇలాంటి వీడియోలు చూడాలి. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నప్పటికీ.. సోషల్ మీడియా వల్ల కొన్ని మాత్రమైనా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సందేశ్ ఖాళీ గ్రామంలో ఎటువంటి దారుణం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మహిళ అయినప్పటికీ.. మిగతా మహిళలకు ఎటువంటి భద్రత లేకుండా పోయింది. బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఓ మహిళ, మరో పురుషుడిపై ఆ వ్యక్తి ఆ స్థాయిలో దాడులు చేస్తే.. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని” బిజెపి నాయకులు పేర్కొన్నారు.

    కాగా ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ ఖాళీ అనే గ్రామంలో అక్కడి అధికార పార్టీ నాయకుడు షాజహాన్ షేక్ మహిళలను లైంగికంగా వేధించాడు. రేషన్ దుకాణాల్లో పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడు. అయినప్పటికీ మమతా సర్కార్ అతడికి వత్తాసు పలికింది. ఇక ఇటీవల ఎన్నికల్లో షాజహాన్ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి.. అధికార పార్టీకి ఓటు వేసేలా చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సందేశ్ ఖాళీ ఘటన నుంచి ఎలాగోలా బయటపడ్డ మమత బెనర్జీకి.. ఉత్తర్ దినాజ్ పూర్ ఘటన మాత్రం తలనొప్పిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై సిపిఎం నాయకులు కూడా స్పందించారు. బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ పరిపాలనకు ఈ ఘటనే సజీవ తార్కాణమని వ్యాఖ్యానించారు. “ఉత్తర్ దీనాజ్ పూర్ లో జరిగిన దారుణాన్ని వీడియో తీసిన వ్యక్తిని ఇంటి నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ మాదిరే ఇక్కడ కూడా బుల్డోజర్ న్యాయం జరుగుతోందని” సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నారు.