Team India : టీమిండియా పై బీసీసీఐ కనకవర్షం.. అన్ని కోట్ల నజరానా ప్రకటించిన జై షా

Team India : టీమిండియా ఆటగాళ్లకు బహుమతులు ఇచ్చేందుకు పోటీలు పడుతున్నాయి. 2011లో టీమిండియా వరల్డ్ కప్ నెగినప్పుడు సహారా సంస్థ అప్పట్లో క్రికెటర్లకు భారీ నజరానా ప్రకటించింది. బీసీసీఐ కూడా భారీ ప్రైజ్ మనీ ఇచ్చింది.

Written By: NARESH, Updated On : June 30, 2024 9:17 pm

BCCI secretary Jai Shah announced 125 crores for the Indian cricketers who won the World Cup.

Follow us on

Team India : 17 ఏళ్ల ఎదురుచూపు తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. వెస్టిండీస్ వేదికగా బార్బడోస్ మైదానంలో దక్షిణాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ విజయం నేపథ్యంలో టీమిండియా పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలుపెడితే మహేంద్ర సింగ్ ధోని వరకు.. టీమిండియా ఆటగాళ్లకు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఓటమి అనేది లేకుండా టీమిండియా వరుస విజయాలు సాధించింది. లీగ్ దశలో ఐర్లాండ్ జట్టుపై విజయం సాధించి.. తన టి20 ప్రస్థానం ప్రారంభించిన టీమ్ ఇండియా.. దక్షిణాఫ్రికా పై ఫైనల్ మ్యాచ్ వరకు కొనసాగించింది.

ఇక ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఉత్కంఠ మధ్య విజయం సాధించింది.. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి పడిపోతున్న టీమిండియా ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు.. అక్షర్ పటేల్ 47 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.. ఒకానొక దశలో 34 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాల్గవ వికెట్ కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించారు. ఐదో వికెట్ కు శివం దూబే(27) తో కలిసి 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది.

అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా.. రెండు వికెట్లు పడగొట్టి.. 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు.. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ ఇచ్చిన రిలే క్యాచ్ పట్టి, సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ను టీమిండియా వైపు మొగ్గేలా చేశాడు.. దక్షిణాఫ్రికా జట్టులో క్లాసెన్ 27 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 52 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడు మైదానంలో ఉన్నంత సేపు టీమ్ ఇండియాకు గెలుపు పై ఏమాత్రం ఆశలు లేవు. క్లాసెన్ అద్భుతమైన స్లో డెలివరీతో హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించాడు. దీంతో అప్పుడు భారత జట్టు కాస్త ఊపిరి పీల్చుకుంది. ఉత్కంఠ మధ్య టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో.. బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.

బిసిసిఐ కార్యదర్శి జై షా టీమిండియా సాధించిన విజయాన్ని పురస్కరించుకొని 125 కోట్ల నజరానాను ప్రకటించారు. ఈ నగదును ఆటగాళ్లు, కోచ్ లు, సహాయక సిబ్బంది కి సమానంగా పంచుతారు. “టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చూపించింది. ఆటగాళ్లు, కోచ్ లు, సహాయక సిబ్బంది.. అందరి పాత్ర ఇందులో ఉంది. వారందరి అద్భుతమైన ప్రతిభ వల్లే ఇది సాధ్యమైంది. వారి ప్రతిభను గుర్తిస్తూ బీసీసీఐ తరపున టీమ్ ఇండియాకు 125 కోట్లు నజరానా ప్రకటిస్తున్నాం. భవిష్యత్తులోనూ టీ మీడియా ఇదే స్థాయిలో విజయాలు సాధించాలని” జై షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.. మరోవైపు బడా కార్పొరేట్ సంస్థలు కూడా టీమిండియా ఆటగాళ్లకు బహుమతులు ఇచ్చేందుకు పోటీలు పడుతున్నాయి. 2011లో టీమిండియా వరల్డ్ కప్ నెగినప్పుడు సహారా సంస్థ అప్పట్లో క్రికెటర్లకు భారీ నజరానా ప్రకటించింది. బీసీసీఐ కూడా భారీ ప్రైజ్ మనీ ఇచ్చింది.