T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ లో.. పొదుపైన బౌలర్.. సాహో బుమ్రా భాయ్

T20 World Cup 2024 : ఇక శిక్షణలో అతడు యార్కర్లపై మరింత దృష్టి పెట్టాడు. స్థానిక టోర్నమెంట్లలో 140 కిలోమీటర్ల వేగానికి మించి బంతులు వేసేవాడు. వాస్తవానికి జస్ ప్రీత్ బుమ్రా క్రికెట్ లోకి వెళ్ళటం అతడి తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ కోచ్ త్రివేది, పురోహిత్ ఆమెకు నచ్చ చెప్పడంతో ఒప్పుకుంది.

Written By: NARESH, Updated On : June 30, 2024 9:32 pm

Jasprit Bumrah as the top bowler in T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024 : అనిశ్చితికి మారుపేరైన క్రికెట్లో ఏదైనా సాధ్యమే. టెస్ట్ క్రికెట్ ను కాస్త మినహాయిస్తే.. వన్డేను కాస్త పక్కన పెడితే.. టి20 వరల్డ్ కప్ లో ఏదైనా జరుగుతుంది. మ్యాచ్ ఎటు వైపైనా మొగ్గుతుంది. శనివారం ముగిసిన టి20 వరల్డ్ కప్ లో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకున్నాయి. మరెన్నో ఆశ్చర్యాలు కళ్ళ ముందు కనిపించాయి. అయితే ఇంతటి పొట్టి ఫార్మాట్ లోనూ ఒక పాత సామెతను టీమిండియా ఆటగాడు నిజం చేసి చూపించాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..

క్రికెట్ సర్కిల్లో ” బ్యాటర్లు మ్యాచులలో విజయాలు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తారు. కానీ బౌలర్లు ఏకంగా టోర్నమెంట్ లనే కానుకగా అందిస్తారు” అనే ఓ సామెత ఎప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఎందుకంటే వందల ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ సామెత అనేక సందర్భాల్లో నిజమైంది కాబట్టి. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఈ సామెతను నిజం చేసి చూపించాడు టీమిండియా ఏస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు . టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు.. ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. బౌలర్ అంటే వికెట్లు మాత్రమే తీయడం కాదని.. అంతకుమించిన పాత్ర పోషించాలని తన బౌలింగ్ ద్వారా నిరూపించాడు. అందుకే టి20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. వాస్తవానికి జస్ ప్రీత్ బుమ్రా కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫారూఖీ.. అర్ష్ దీప్ సింగ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయినప్పటికీ జస్ ప్రీత్ బుమ్రా కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారం లభించింది. దీనికి కారణం అతడు పొదుపుగా బౌలింగ్ చేయడమే..

జస్ ప్రీత్ బుమ్రా ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు.. ప్రస్తుత ఎడిషన్లో 20 ఓవర్లు వేసిన వారిలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే.. అది ముమ్మాటికి జస్ ప్రీత్ బుమ్రానే. టి20 లలో ఒక బౌలర్ ఎకానమీ ఆరు ఉంటే చాలా గొప్ప. కానీ జస్ ప్రీత్ బుమ్రా 4.17 ఎకానమీ నమోదు చేశాడు. అంటే ఏ స్థాయిలో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో 8 మ్యాచ్ లలో బౌలింగ్ చేసిన జస్ ప్రీత్ బుమ్రా 178 బంతులు వేశాడు. అందులో 110 డాట్ బాల్సే. ఇక మిగిలిన 68 బంతులకు 124 పరుగులు ఇచ్చాడు. 15 వికెట్లు పడగొట్టాడు. అయితే వీటిలో రెండు మెయిడిన్లు ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అయితే డాట్ బాల్స్ తో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

బౌలింగ్ వేసే సమయంలో జస్ ప్రీత్ బుమ్రా యాక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. అయితే అతడు దానిని టీవీలో చూసే నేర్చుకున్నాడట. జస్ ప్రీత్ బుమ్రా కు ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. తల్లి దల్జిత్ అనేక కష్టాలు ఎదుర్కొని అతడిని పెంచింది..జస్ ప్రీత్ బుమ్రా కు చిన్నప్పటి కోచ్ లు గా కిషోర్ త్రివేది, కేతుల్ రోహిత్ వ్యవహరించారు. అతని బౌలింగ్ పట్ల వారికి విపరీతమైన నమ్మకం ఉండేది. బౌలింగ్ యాక్షన్ ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని అతడికి ఆ రోజుల్లోనే సూచనలు చేశారు. ఇక శిక్షణలో అతడు యార్కర్లపై మరింత దృష్టి పెట్టాడు. స్థానిక టోర్నమెంట్లలో 140 కిలోమీటర్ల వేగానికి మించి బంతులు వేసేవాడు. వాస్తవానికి జస్ ప్రీత్ బుమ్రా క్రికెట్ లోకి వెళ్ళటం అతడి తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ కోచ్ త్రివేది, పురోహిత్ ఆమెకు నచ్చ చెప్పడంతో ఒప్పుకుంది.