దేశంలోని పలు జాతీయ రాజకీయ పార్టీలకు లభిస్తున్న విరాళాలలో అత్యధిక భాగం గుర్తు తెలియని వారి నుండి, అంటే అనుమానాస్పద మార్గాల ద్వారా సమకూరుతున్నట్లు వెల్లడి అవుతున్నది. ఎన్నికల కమీషన్ కు రాజకీయ పార్టీలు సమర్పించిన జమా, ఖర్చుల వివరాలను విశ్లేషించిన ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ అంశాన్ని వెల్లడించింది.
2004-05 నుంచి 2018-19వరకు దేశంలోని ఏడు జాతీయ పార్టీలు అజ్ఞాత వ్యక్తులు, గుర్తుతెలియని సంస్ధల నుంచి రూ.11,234 కోట్ల విరాళాలు పొందాయని ఏడీఆర్ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం నిధులలో ఈ మొత్తం 67 శాతం వరకు ఉన్నది.
జాతీయ పార్టీలైన అధికార తోబీజేపీపాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీఐలు అజ్ఞాత వ్యక్తుల నుంచి సేకరించిన విరాళాల గురించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదికలిచ్చాయి.
రూ 20,000, అంతకన్నా ఎక్కువ మొత్తాల విరాళాలను అజ్ఞాత వ్యక్తులు, గుర్తుతెలియని సంస్థల నుంచి వచ్చిన నిధులుగా జాతీయ పార్టీలు తమ ఐటీ రిటర్స్న్‌లో వెల్లడించాయి.
రాజకీయ పార్టీలు విరాళాలు, ఎలక్టోరల్ బాండ్లు కూపన్ల అమ్మకాలు, రిలీఫ్ ఫండ్, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాల్లో వసూలైన మొత్తాలను అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు.
తమకు అజ్ఞాత వ్యక్తులు, గుర్తుతెలియని సంస్థల నుంచి రూ.1612.04కోట్ల విరాళాలు వచ్చాయని అధికార బీజేపీ ప్రకటించింది. ఆ పార్టీకి వచ్చిన నిధులలో ఈ మొత్తం 64 శాతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రూ.728.88 కోట్ల విరాళాల్లో 29 శాతం అజ్ఞాత వ్యక్తులు, గుర్తుతెలియని సంస్థల నుంచి వచ్చాయి.
కాంగ్రెస్, ఎన్సీపీలు కూపన్ల విక్రయాల ద్వారా రూ.3,902.63 కోట్ల విరాళాలు వచ్చాయని ప్రకటించాయి. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తమకు స్వచ్ఛందంగా ఎలాంటి విరాళాలు రాలేదని ప్రకటించింది.