తెలుగు సినిమా రంగం ఇప్పుడు భారత దేశంలో అందరికీ ఆదర్శం గా నిలుస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ తెలుగు సినీ తారలు , నిర్మాతలు దర్శకులు సాయం అందించడం లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊహించని రీతిలో ముందుకొచ్చి ఆర్ధికంగా విరాళాలు ఇస్తున్నారు. వీరి వితరణ చూసి దేశమంతా ప్రశంసిస్తున్నారు. తెలుగు సినీ రంగం నుంచి ఇప్పటివరకు సుమారు 13 కోట్ల రూపాయలు పైగానే ఆర్ధిక విరాళాలు వచ్చాయి. ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఇది నిజంగా అభినందించ తగ్గ విషయం. తెలుగు ప్రేక్షకులు గర్వించ తగ్గ విశేషం.
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సరైన సమయంలో ప్రభుత్వానికి చేయూత అందిస్తున్న తెలుగు సినీ రంగం దేశం మొత్తానికి ఒక కొత్త దారి చూపించింది. దేశం మొత్తంలో తెలుగు హీరోల మాదిరి స్పందిస్తున్న హీరోలు మరే ఇండస్ట్రీలోనూ లేరు. తమిళ స్టార్లు కూడా ముందుకొచ్చారు కానీ.. మన వాళ్ల ముందు వాళ్ల విరాళాలు చాలా స్వల్పమే …
ఇక హిందీ చిత్ర రంగం వాళ్లయితే తమ దాతృత్వాన్ని చాటుకోవాల్సిన వేళ తేలు కుట్టిన దొంగల్లా మిన్నకున్నారు. అందుకే టాలీవుడ్ స్టార్ల విరాళాల గురించి జాతీయ స్థాయిలో గొప్పగా చెప్పుకొంటున్నారు. మన వాళ్ళను రియల్ హీరోలుగా పొగుడుతున్న సోషల్ మీడియా.. బాలీవుడ్ హీరోలను విమర్శిస్తూ ఈ సమయంలో కూడా మీరు స్పందించరా అంటూ నిలదీస్తోంది.