Tella Kagitham Review : ‘కోర్ట్’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్.. ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌ను ఎంచుకున్నారు. టీనేజ్ ప్రేమ, తల్లిదండ్రుల భయం, వయసుకు మించిన నిర్ణయాలు.. ఇలాంటి సున్నితమైన అంశాలను కలిపి తెరకెక్కించిన సినిమా ‘తెల్ల కాగితం’. డెబ్యూ డైరెక్టర్ రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మంచి పాయింట్‌ను ఎంచుకున్నా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో సినిమా తడబడింది.
కథేంటి?
ఇంటర్ చదువుతున్న ఓ అమాయకమైన అబ్బాయి.. కఠినమైన తండ్రి ఉన్న ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరి మధ్య ప్రేమ క్రమంగా శారీరక సాన్నిహిత్యానికి దారితీస్తుంది. ఆ తర్వాత వారి జీవితాల్లో అనుకోని సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలను ఎదుర్కొనే క్రమంలో వారు తీసుకునే నిర్ణయాలు, వాటి ప్రభావం కుటుంబాలపై ఎలా పడింది? చివరకు తల్లిదండ్రులకు విషయం తెలిసిన తర్వాత పరిస్థితులు ఎలాంటి మలుపు తిరిగాయి? అనేదే సినిమా ప్రధాన కథాంశం.
నటీనటుల పనితీరు
హర్ష్ రోషన్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కాస్త రిజిడ్‌గా కనిపించారు. పాత్రలోని భావోద్వేగాలను పూర్తిస్థాయిలో పలికించడంలో కొంత వెనుకబడ్డారు.
హీరోయిన్ బొగాపతి నక్షత్రకు ఇది తొలి సినిమా అయినప్పటికీ.. స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో ఆమె కాన్ఫిడెన్స్ బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు.
కఠినమైన తండ్రి పాత్రలో అజయ్ మరోసారి తన అనుభవాన్ని చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు బలంగా నిలిచింది.
ఎక్కడ తడబడింది?
‘తెల్ల కాగితం’లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కథ కాదు.. కథను చెప్పిన విధానం. టీనేజ్‌లో ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులతో పంచుకోవాలనే మంచి సందేశాన్ని దర్శకుడు ఎంచుకున్నారు. కానీ ఆ సందేశాన్ని ప్రేక్షకుడికి బలంగా చేరవేయడానికి కావాల్సిన ఎమోషనల్ ట్రీట్‌మెంట్ మాత్రం కనిపించలేదు.
మొదటి 30 నిమిషాలు సినిమా పర్వాలేదనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత కథనం నెమ్మదించడం మొదలవుతుంది. ప్రధాన సమస్య చుట్టూనే కథను పదేపదే తిప్పడంతో సెకండ్ హాఫ్‌లో గ్రిప్ తగ్గుతుంది. కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి సాగినట్లు అనిపిస్తాయి.
టీనేజ్ ప్రేమకథలకు కావాల్సిన సహజత్వం, భావోద్వేగం, స్క్రీన్‌ప్లేలో వేగం లేకపోవడంతో ప్రేక్షకులు పాత్రలతో పూర్తిగా కనెక్ట్ కాలేకపోతారు. ‘కొత్త బంగారు లోకం’ తరహాలో యువత, ప్రేమ, తల్లిదండ్రుల మధ్య సంఘర్షణను చూపించే ప్రయత్నం కనిపించినా.. ఆ స్థాయి ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం రాలేదు.
టెక్నికల్‌గా..
విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు చెప్పుకోదగ్గ బలాన్ని ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా కీలకమైన సన్నివేశాల్లో సంగీతం మరింత ప్రభావవంతంగా ఉండాల్సింది. సెకండ్ హాఫ్‌లో ఎడిటింగ్ కూడా కాస్త కట్టుదిట్టంగా ఉంటే సినిమా నిడివి, బోర్ ఫీలింగ్ రెండూ తగ్గేవి.
టీనేజ్ వయసులో పిల్లలు ఎదుర్కొనే సమస్యలను తల్లిదండ్రులతో పంచుకోవాలనే ఆలోచనతో ‘తెల్ల కాగితం’ రూపొందింది. ఈ పాయింట్‌లో మంచి ఉద్దేశం ఉంది. కానీ ఆ మంచి ఉద్దేశాన్ని ప్రేక్షకుడిని కట్టిపడేసే కథనంగా మార్చడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.
మొదటి భాగం కొంత ఆసక్తికరంగా అనిపించినా.. సెకండ్ హాఫ్‌లో సాగతీత, మెలోడ్రామా కారణంగా సినిమా ప్రభావం తగ్గుతుంది. హీరోయిన్ నటన, అజయ్ పెర్ఫార్మెన్స్ మినహా పెద్దగా గుర్తుండిపోయే అంశాలు కనిపించవు.
బాటమ్ లైన్: మంచి మెసేజ్ ఉంది.. కానీ చెప్పిన విధానంలో పట్టు లేకపోవడంతో ‘తెల్ల కాగితం’ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది.
ఓకేతెలుగు రేటింగ్: 2/5