Court Movie: గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా చిన్న సినిమాల హవా చాలా గట్టిగానే కొనసాగుతుంది. ఏడాది ప్రారంభం లోనే రెండు చిన్న సినిమాలు అటు తమిళ ఇండస్ట్రీ లోనూ, ఇటు తెలుగు ఇండస్ట్రీ లోనూ దున్నేస్తున్నాయి. గత కొంత కాలం గా సరైన బాక్స్ ఆఫీస్ హిట్ లేక వెలవెలబోయిన తమిళనాడు థియేటర్స్, రీసెంట్ గా విడుదలైన డ్రాగన్ అనే చిన్న సినిమాతో మళ్ళీ ఊపిరి పోసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపుగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి సినిమానే రీసెంట్ గా మన తెలుగు లో విడుదలైన కోర్ట్ చిత్రం(Court Movie). నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ఈ కోర్ట్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తుంది. వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆరవ రోజున కోటి 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు వెర్షన్ నుండి వచ్చాయని, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా కోటి 58 లక్షల రూపాయిలు వచ్చాయని అంటున్నారు. మొత్తం మీద బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో ఈ సినిమాకు దాదాపుగా 8 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఈ వీకెండ్ తో 1 మిలియన్ మార్కుకి చేరుకుంటుందని అంటున్నారు. మొత్తం మీద ఆరు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, షేర్ వసూళ్లు 18 కోట్ల రూపాయిల వరకు వచ్చిందని అంటున్నారు. ఈ వీకెండ్ తో ఈ చిత్రం పాతిక కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్ల పేర్లు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసి ఉండవు. అయినప్పటికీ ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే మంచి సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆదరిస్తారు అనడానికి ఉదాహరణ గా చెప్పొచ్చు. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకు ఊహకు మించిన వసూళ్లను రాబడుతుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయలకు జరిగితే, కేవలం నైజాం ప్రాంతంలోనే ఆరు రోజులకు 6 కోట్ల 53 లక్షల రూపాయిలు వచ్చాయని చెప్తున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతంలో 90 లక్షలు, ఓవర్సీస్ ప్రాంతంలో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఈ వీకెండ్ తో 1 మిలియన్ డాలర్ గ్రాస్ వసూళ్లను అందుకోనుంది ఈ సినిమా.