iBomma Ravi Case Updates: గత కొంతకాలం గా పోలీసుల అదుపులో ఉన్నటువంటి పైరసీ వెబ్ సైట్ ‘ఐబొమ్మ'(iBomma) నిర్వాహకుడు ఇమంది రవికి సంబంధించిన బెయిల్ పిటీషన్ కేసు నేడు నాంపల్లి కోర్టు లో విచారణకు వచ్చింది. సుదీర్ఘ చర్చల తర్వాత, ఈ బెయిల్ పిటీషన్ ని న్యాయస్థానం కొట్టిపారేసింది. కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టుని ఆశ్రయించాడు. దీంతో నేడు విచారించగా, పోలీసులు ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుందని, ఇలాంటి సమయం లో రవికి బెయిల్ ఇస్తే దర్యాప్తు కి అంతరాయం కలుగుతుందని జడ్జికి వివరించారట. అంతే కాదు అతనికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే అక్కడికి పారిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారట. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం బెయిల్ పిటీషన్ ని రద్దు చేసింది.
రీసెంట్ గానే పోలీసులు రవి ని పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో మీడియా రిపోర్టర్ రవి ని పలు ప్రశ్నలు అడగడం, అందుకు ఆయన చిరాకు పడడం వంటివి మనం చూసాము. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇతనికి ఇంకా పొగరు తగ్గలేదుగా అని సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు అనుకున్నారు. బహుశా బయటకు వచ్చేస్తాను అనే ధీమా ఇతనిలో ఫుల్ గా ఉందేమో అని కూడా అనుకున్నారు. కానీ చివరికి అతనికి చుక్కెదురు అయ్యింది. ఇంకా ఎన్ని రోజులు ఈయన జైలు లో ఉంటాడో చూడాలి. రవి ని అరెస్ట్ చేసి దాదాపుగా నెల రోజుల పైనే అయ్యింది. ఇతని అరెస్ట్ ని సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక పండుగ లాగా సెలెబ్రేట్ చేసుకుంది. కానీ సోషల్ మీడియా లో మాత్రం నెటిజెన్స్ నుండి ఇతనికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే వేలు పెట్టి థియేటర్ కి వెళ్లి సినిమా చూసే అవకాశం ఇవ్వకుండా, ఉచితంగా ఇంట్లోనే కూర్చొని కుటుంబం తో హాయిగా సినిమా చూసే అవకాశం ఇచ్చాడని ఇతని పై జనాల్లో సానుభూతి అయితే బలంగానే ఉంది.