Mana Shankara Varaprasad Garu first ticket: మరో 5 రోజుల్లో మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండగ మొదలు కాబోతుంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara varaprasad garu) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్స్ మొత్తం క్లిక్ అవ్వడం వల్ల ఈ సినిమాపై హైప్ పెంచడంలో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. యూత్ ఆడియన్స్ కొంతమంది ఇది ట్రైలర్ లాగా లేదు, సీరియల్ బిట్ లాగా ఉందని కామెంట్స్ చేస్తూ, ఫన్నీ మీమ్స్ చేస్తున్నప్పటికీ కూడా, ఈ సినిమా పై ఎలాంటి ప్రభావం పడలేదు. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ థియేట్రికల్ ట్రైలర్ తర్వాతనే బాగా పెరిగాయి. ఎప్పుడెప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడుతారా అనే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి టికెట్ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులూ మోకా వెంకట సుబ్బారావు 1,16,000 రూపాయలకు కొనుగోలు చేసాడు. నేడు అమలాపురం లోని వెంకట రమణ థియేటర్ వద్ద జరిగిన వేలం పాటలో సుబ్బారావు తో పాటు పలువురు పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ వేలం పాటలో సుబ్బారావు కి ఈ మొదటి టికెట్ అందింది. ఈ సందర్భంగా అత్యధిక ధరకు టికెట్ రేట్ ని కొనుగోలు చేసినందుకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రావణం స్వామి నాయుడు అభినందించాడు. ఈ మొదటి టికెట్ ని చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ చేతుల మీదుగా సుబ్బారావు కి అందిస్తామని స్వామి నాయుడు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. గతం లో కూడా చాలా సినిమాలకు ఇలాంటివి జరుగుతూ వచ్చేవి.
ఇకపోతే నేడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. సాయంత్రం 5:30 నుండే ఈవెంట్ ని మొదలు పెడతారట. ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరిగింది. అందులో ఎలాంటి నిజం లేదని, కేవలం మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మరియు మూవీ టీం మాత్రమే వస్తారని, ఎలాంటి చీఫ్ గెస్ట్స్ రావడం లేదని తెలుస్తుంది.