Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమై.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామ్. హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్లో దూసుకెళ్లిపోతున్నారు కళ్యాణ్. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా.. సరికొత్త కథలున్న చిత్రాలనూ ఎంచుకుని తనలోని నటనకు పదును పెడుతున్నారు.
అయితే, పటాస్ సినిమా తర్వాత పెద్దగా హిట్ అందుకోలేకపోయారు కళ్యాణ్. ఇప్పుడు తన కెరీర్లో ఎప్పుడూ చేయని హిస్టారికల్ సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు బింబిసారా అనే టైటిల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మగధ రాజ్యాధిపతి బింబిసార జీవిత కథ ఆధారంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా, పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని సమాచారం. ఇప్పటి వరకు మోషన్ పోస్టర్ తప్ప ఈ సినిమా నుంచి మరే అప్డేట్ లేదు. ఈ కథ మొత్తం టైమ్ ట్రావెల్ చుట్టూ నడుస్తుందని తెలుస్తోంది. త్వరగా షూటింగ్ పూర్తయితే.. డిసెంబరులో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ క్రమంలోనే సన్నాహాలు జరుగుతున్నాయని చిత్రయూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్. ఈ సినిమాతోనైనా హిట్ కొడతారేమో చూడాలి మరి.