War 2 pre Release Event Jr NTR: అభిమానులే మా బలం.. అభిమానులే మా దైవం.. అభిమానులు లేకుంటే మేము లేము.. అని చాలామంది హీరోలు అంటూ ఉంటారు. వేదిక దిగగానే అభిమానులను మర్చిపోతుంటారు. పైగా అప్పుడప్పుడు అభిమానుల మీద దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు. అభిమానులు అంటే అతడికి చాలా ఇష్టం. అభిమానులకు ఆపద వస్తే ఆయన చలించిపోతారు. వారికి ఏదైనా చేయాలనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తుంటారు. చాలా సందర్భాల్లో అభిమానులకు ఆయన ఇతోధికంగా సహాయం చేశారు. అందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి.
Also Read: తప్పు అయిపోయింది అంటూ క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్..వీడియో వైరల్!
అప్పట్లో ఒక అభిమాని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని.. తన చివరి కోరిక అని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఏదో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ అభిమాని చివరి కోరిక తీర్చాడు. అతనితో ఫోన్లో వీడియో కాల్ లో మాట్లాడాడు. ధైర్యవచనాలు చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ అభిమాని డాక్టర్లు చెప్పిన దానికంటే ఎక్కువ రోజులే బతికాడు. కాకపోతే చివరి రోజుల్లో తన అభిమానికి ఒక సాంత్వన కలిగించాననే సంతృప్తి జూనియర్ ఎన్టీఆర్ కు జీవిత కాలం ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఆపదలో ఉన్న తన అభిమానులకు ఎన్నో రకాలుగా జూనియర్ ఎన్టీఆర్ సహాయ సహకారాలు అందించారు. చదువులకు, వైద్యానికి.. ఇతర వాటికి జూనియర్ ఎన్టీఆర్ భారీగానే సహాయం చేశారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ -2 సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఇది పూర్తిగా బాలీవుడ్ చిత్రం అయినప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటించారు. ఈ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో ఆదివారం యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో జరిగింది. ఈ సందర్భంగా వేదిక మీద జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతుండగా ఒక అభిమాని వచ్చి ఆయన కాళ్లకు నమస్కరించారు. సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంటే.. జూనియర్ ఎన్టీఆర్ వద్దని వారించారు. అంతేకాదు ఆ అభిమానిని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. వేదిక దిగిన తర్వాత మరో అభిమాని కూడా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చారు. అయితే అతడు చెవిటి, మూగ. అతడి గురించి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కి పరిచయం చేశారు. అతనితో కలిసి ఫోటో కూడా దిగారు.
Also Read: మైక్ విరగొట్టి వెళ్ళిపోతా..నిమిషం పట్టదు అంటూ ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ వార్నింగ్!
అంతకుముందు వేదిక మీద జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తన అభిమాని ముజీబ్ పేరును ప్రస్తావించారు.. ఇటువంటి అభిమానుల అభిమానం దక్కించుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. వార్ -2 సినిమాలో తన పాత్ర గొప్పగా ఉంటుందని.. తన అభిమానులు కాలర్ ఎగిరేసే విధంగా ఉంటుందంటూ.. తన ఒంటి మీద ఉన్న చొక్కాను ఎగరేసి జూనియర్ ఎన్టీఆర్ వివరించారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని అందించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు అభిమానితో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు.. హృతిక్ రోషన్ కు పరిచయం చేసిన విధానం.. గొప్పగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు