Uttarandhra Folk Arts: జనం నుంచి పుట్టినదే జానపదం( folk songs).. ఇది మనుషుల మనసు లోతుల్లోంచి వచ్చే స్వచ్ఛమైన భావాలకు ప్రతిరూపం. వీటికి కొలతలు, లెక్కలు ఉండవు. ప్రజా బహుళ్యంలో ప్రచారం పొందుతాయి. ప్రతి వ్యక్తి పెదవులపై ఆడతాయి. అయితే ఈ జానపదాలకు సోషల్ మీడియా పుణ్యమా అని ఆదరణ లభిస్తోంది. ఈ జానపదాలకు సినీ బాణీలను కట్టి సినిమా దర్శకులు సైతం ప్రోత్సహించడం ప్రారంభించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జానపదాలు ఇటీవల సినిమా మాధ్యమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి కారణం సోషల్ మీడియా. అయితే ఉత్తరాంధ్ర జానపదాలను కాపాడింది మాత్రం ఓ సంస్థ. కనుమరుగవుతున్న జానపద కళలను సజీవంగా ఉంచే ప్రయత్నం చేసింది. కళాకారులను తట్టి ప్రోత్సహించింది. వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి బాహ్య ప్రపంచానికి అందించింది. అదే విశాఖలోని శ్రీమాతా రికార్డింగ్ కంపెనీ. ప్రైవేటు ఆడియో రంగంలో విపరీతమైన పోటీని తట్టుకుంది. అందుకు సరైన గమ్యాన్ని జానపదంగా ఎంచుకుంది. హరికథలు, బుర్రకథలు, డ్రామా పద్యాలు, జముకుల కథ, సన్యాసమ్మ కథ, మిమిక్రీలు.. ఇలా ఒకటేమిటి.. లోకల్ టాలెంట్ను ప్రోత్సహించిన ఘనత మాత్రం వన్ అండ్ ఓన్లీ శ్రీమాతా ఆడియో కంపెనీ. వేలాది ఆల్బమ్స్, వందలాదిమంది కళాకారుల పాడిన పాటలను బహుళ ప్రపంచంలో ప్రాచుర్యం కల్పించడంలో మాత్రం ముందుంది. జానపద పాటలు వేలాదిగా ఉండే గ్రంథాలయం.. విశాఖ శ్రీ మాత రికార్డింగ్ కంపెనీ.
Also Read: ఏపీలో తొలి కాఫీ పార్క్.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
ప్రతి జనం పాటకూ ప్రాచుర్యం..
సాధారణంగా వ్యవసాయం( cultivation) సాగు చేసే రైతు, రైతు కూలీ ఆటవిడుపుగా పాటలు పాడుతుంటారు. తమ శ్రమను అధిగమించేందుకు ఇలా పాటలు పాడుతుంటారు. అవే జానపదాలు. జనం నోటి నుంచి వచ్చినవే. గ్రామీణ జీవిత స్వచ్ఛతకు అడ్డం పట్టే జీతాలు అనేక రూపాల్లో ఉన్నాయి. వలపు పాటలు, మహిళల పాటలు, పిల్లల పాటలు, పని పాటలు, నవ్వుల పాటలు, సరసాల పాటలు, తత్వాలు, మేలుకొలుపులు.. ఇవన్నీ కూడా జానపదాలే. ఈ మధ్యకాలంలో జానపద బాణీల ఆధారంగా విడుదలైన సినిమా పాటలు యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాయి. అయితే ఇప్పుడు కదా సాంకేతిక విప్లవం వచ్చింది. కానీ ఇంటర్నెట్ లేని రోజుల్లో జానపదాలకు ఆశ్రయం ఇచ్చిన సంస్థ మాత్రం శ్రీమాతా ఎంటర్ప్రైజెస్. జానపద కళాకారుల నోటి నుంచి వచ్చే పాటలను క్యాసెట్ల రూపంలో అందించింది సదరు సంస్థ. అప్పట్లో గరివిడి లక్ష్మి బుర్రకథ ఒక సంచలనమే. ఆడియో రూపంలో తెచ్చిన ఈ క్యాసెట్ ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటా కనిపించేది. ప్రతి నోటా వినిపించేది. అలా ప్రస్థానం ప్రారంభించిన శ్రీ మాత వందలాది మంది కళాకారులకు ప్రోత్సాహం అందించింది. వేలాది ఆల్బమ్స్ రూపొందించింది. ప్రైవేట్ ఆడియో రంగంలో విపరీతమైన పోటీని తట్టుకొని నిలబడింది. కేవలం జానపదాన్ని నమ్ముకుని ముందుకు సాగి విజయం సాధించింది.
వర్ధమాన కళాకారులకు ఛాన్స్
వర్ధమాన కళాకారుల్లో ఎంతోమంది ప్రారంభ దశలో.. శ్రీమాతా( Shri Mata ) సంస్థ ద్వారా పరిచయం అయిన వారే. సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రోత్సాహంతో ప్రారంభించిన ఈ సంస్థ.. తొలుత ఆడియో క్యాసెట్ల రూపంలో సేవలు ప్రారంభించింది. అనతి కాలంలో శ్రీమాతా రికార్డింగ్ కంపెనీగా మారింది. అప్పుడే వర్ధమాన జానపద కళాకారులు, ఏ ప్రోత్సాహం లేని లోకల్ టాలెంటెడ్ వ్యక్తులు శ్రీమాతాను ఆశ్రయించడం ప్రారంభించారు. ప్రముఖ గాయకులుగా రాణిస్తున్న మల్లికార్జున్, గోపిక పూర్ణిమ దంపతులు ప్రారంభ దశలో శ్రీమాతా రికార్డింగ్ కంపెనీ ద్వారా ఎన్నో పాటలు పాడారు. ఒక్క జానపదమే కాదు ఆధ్యాత్మిక పాటలు సైతం ఇదే సంస్థ ద్వారా వేలాదిగా బహుళ ప్రాచుర్యం పొందాయి.
Also Read: లవంతపు సలహాలు.. చంద్రబాబు పట్టించుకుంటారా?
ఎంతోమంది కళాకారులకు సినీ అవకాశం.. విశాఖలోని( Visakhapatnam) శ్రీమాతా సంస్థ ద్వారా ఎంతోమంది సినీ రంగంలో కూడా అవకాశం దక్కించుకున్నారు. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాట పాడిన గంటా వెంకటలక్ష్మి శ్రీమాతా సంస్థ ద్వారా ఎంపికైన వారే. అంతకుముందు ఇదే సంస్థ ద్వారా జానపదాలు పాడారు. బుర్రకథలు ఆలపించారు. రంగస్థలం సినిమాలో సన్నివేశానికి తగ్గట్టు.. సినిమా నేపథ్యానికి తగ్గట్టు ఓ ఐటమ్ సాంగ్ రూపొందించారు దర్శకుడు సుకుమార్. అయితే దానికి తగ్గట్టు గాత్రం కోసం అన్వేషించారు దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. అటువంటి సమయంలో శ్రీమాతా యూట్యూబ్ ద్వారా వెంకటలక్ష్మి గాత్రాన్ని చూసి ఎంపిక చేశారు. అలా ఆమె నేపథ్య గాయకురాలయ్యారు. అటువంటి అవకాశాన్ని ఇదే సంస్థ ద్వారా దక్కించుకున్నారు బాడ సూరన్న అనే కళాకారుడు. జానపదాలు చక్కగా పాడే సూరన్న గ్రామాల్లో గంగిరెద్దులు తిప్పుకొని జీవనోపాధి పొందేవారు. అటువంటి వ్యక్తిని పిలిపించి తమ రికార్డింగ్ కంపెనీ ద్వారా క్యాసెట్ల రూపంలో బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు. అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురం సినిమాలో సిత్తరాల సిరపడు పాట పాడే అవకాశం దక్కించుకున్నారు సూరన్న… ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది కళాకారులు సినీ రంగానికి పరిచయం చేసింది శ్రీమాతా సంస్థ. రేలా రేలా రఘు, పల్సర్ బైక్ రమణ.. ఇలాంటి జానపద కళాకారులకు జీవం పోసింది మాత్రం శ్రీమాత సంస్థ. వీరే కాదు ఉత్తరాంధ్రలో ప్రతి జానపద కళాకారుడు తలుపు తట్టింది. వారి గొంతును బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఈ విషయంలో మాత్రం శ్రీమాతా గ్రేట్. జానపద కళాకారుల పుట్టినిల్లుగా తమ సంస్థను అభివర్ణిస్తారని.. జనపదం జానపదం బతకాలన్నదే తమ అభిమతం అని శ్రీమాతా సంస్థ అధినేతలు భిన్నాల నరసింహమూర్తి, పల్లి నాగభూషణరావు చెబుతున్నారు.
