Visakhapatnam Development: విశాఖకు( Visakhapatnam) అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థిక రాజధానిగా భావిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించి విశాఖలో పెడుతోంది. ముఖ్యంగా ఐటీ పరంగా అభివృద్ధి చేస్తోంది. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలను విశాఖలో ఏర్పాటు చేసేలా ఒప్పందాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఒక్క ఐటీ పరంగానే కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం విశాఖలో ఏర్పాటు అవుతున్నాయి. ఇంకోవైపు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు అందుబాటులోకి రానుంది. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ నగరాన్ని అంతర్జాతీయంగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. తాజాగా ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.
అన్ని విధాలా గుర్తింపు
ఇప్పటికే పర్యాటకంగా( tourism) విశాఖ నగరం ఎంతో గుర్తింపు సాధించింది. ఇప్పుడు పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తుండడంతో విశాఖ స్వరూపమే మారనుంది. ఈ తరుణంలో మెట్రో రైలు ప్రాజెక్టుల సైతం త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఈ పరిస్థితుల్లో విశాఖ నగరంలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాంబిల్లి నావెల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేస్ NAOB వరకు సుమారు 70 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్ నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది. భోగాపురం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా రాంబిల్లిని కలుపుతూ ఈ రోడ్డు ఏర్పాటు కానుంది. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రయాణ భారం తగ్గనుంది.
Also Read: సాక్షి లో లోకేశ్ కు ఎలివేషన్.. పాపం కొమ్మినేని.. తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది
అభివృద్ధికి దోహదం..
సాధారణంగా రింగ్ రోడ్డు ( Ring Road)అంటేనే అభివృద్ధి సూచిక. ఈ సెమీ రింగ్ రోడ్డు తో విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్, పారిశ్రామిక అభివృద్ధి వంటి వాటికి దోహదం చేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. లాజిస్టిక్స్ రంగం పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఐటీ సెంటర్లు, ఫార్మాసిటీ, పోర్టు ఆధారిత పరిశ్రమలకు ఈ సెమీ రింగ్ రోడ్డు వెన్నెముకగా నిలవనుంది. దీనివల్ల విశాఖ నగరం లోపలికి భారీ వాహనాల రాక తగ్గి.. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కూడా దొరకనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి అయితే విశాఖ నగర అభివృద్ధికి సంబంధించి ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.