Pulivendula Vontimitta ZPTC Poll: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అ కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో పులివెందుల, ఒంటి మిట్ట ప్రాంతాలలోని జెడ్పిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు స్థానాలలో దాదాపు 11 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.. ప్రధాన పోటీ మాత్రం వైసిపి, టిడిపి మధ్య జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: ఏపీలో తొలి కాఫీ పార్క్.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
పులివెందుల స్థానంలో వైసీపీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా రెడ్డి లతా రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. హేమంత్ రెడ్డి తరఫున కడప ఎంపీ వైస్ అవినాష్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మా రెడ్డి లతా రెడ్డి తరఫున కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి ప్రచారం చేస్తున్నారు. విజయం పై రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి జడ్పిటిసి స్థానాలకు ఉప ఎన్నికలను గతంలో ఎన్నడు కూడా రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకునేవి కావు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయిన తర్వాత టిడిపి, వైసిపి ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పైగా కడప మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కావడంతో.. టిడిపి ఇక్కడ పాగా వెయ్యాలని.. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని భావిస్తోంది. అందువల్లే రకరకాల ప్రయత్నాలను చేస్తోంది. ఒంటి మిట్ట ప్రాంతంలో వైసిపి నుంచి సుబ్బారెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి ముద్దుకృష్ణ రెడ్డి బరిలో ఉన్నారు.. సుబ్బారెడ్డి విజయాన్ని వైసిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు తగ్గేదే లేదు అన్నట్టుగా టిడిపి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
కడప జగన్ సొంత జిల్లా కావడంతో.. ఇక్కడ పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. జడ్పిటిసి స్థానాలలో విజయం సాధించి.. జగన్ బలం పూర్తిగా తగ్గిపోయినట్టు ప్రజలకు చూపించాలని ఉద్దేశంతో టిడిపి పావులు కలుపుతోంది. మరోవైపు వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రచారం చేస్తోంది. ఇక ఆరోపణలు, ప్రత్యారోపణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రెండు పార్టీలు ఆర్థికంగా స్థితిమంతమైనవే కావడంతో ప్రలోభాలకు పాల్పడుతున్నాయి.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండు కీలక పార్టీలు ఓటుకు 5000 చొప్పున పంపిణీ చేస్తున్నాయి. అంతేకాదు గెలుపు పై అనుమానం ఉన్న ప్రాంతాలలో రెండవసారి కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పులివెందుల ప్రాంతంలో 15, ఒంటిమిట్ట ప్రాంతంలో 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య ప్రకారం చూసుకుంటే పులివెందులలో 10,601, ఒంటిమిట్ట ప్రాంతంలో 24,606 మంది ఉన్నారు. పన్నెండో తారీఖున బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతాయి. 14వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.
Also Read: బలవంతపు సలహాలు.. చంద్రబాబు పట్టించుకుంటారా?
ఎన్నికలు 12వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో ఎర్రబల్లి, నల్లగొండ వారి పల్లి, నల్లపురెడ్డి పల్లి ఓటర్లకు సంబంధించిన పోలింగ్ సెంటర్లను రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరానికి మార్చడం పట్ల ఆరోపణ వినిపిస్తున్నాయి. ఈ గ్రామాల్లో ఓటర్లు తమ గెలుపుకు కీలకమవుతారని వైసీపీ నేతలు అంటున్నారు. ఓటింగ్ కు వారిని దూరం చేయడానికే ఈ కుయుక్తికి పాల్పడ్డారని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు కావడంతోనే ఈ కేంద్రాలను దూరంగా మార్చామని ఎన్నికల అధికారులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రెండు జెడ్పిటిసి స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా వేడిని పెంచింది. ఒకవేళ ఈ రెండు స్థానాలలో కూటమి ప్రభుత్వం అంచనా వేసినట్టుగా ఫలితాలు ఉంటే దాని ప్రభావం మరో విధంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ వైసీపీ ఊహించినట్టుగా ఉంటే ప్రభుత్వం మీద జగన్ మారింత రెచ్చిపోతారని వారు పేర్కొంటున్నారు.