
మార్చి నెల తొలి వారం నుంచి దేశంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడిన టెన్షన్ అంతాఇంతా కాదు. ఎక్కడ, ఎప్పుడు, ఎవరినుంచి ఈ వైరస్ సోకుతుందో అర్థం కాక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వైరస్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయితే ఇదంతా గతం. అన్ లాక్ అన్ లాక్ కు కేంద్రం నిబంధనలు సడలిస్తూ ఉండటంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
మొదట్లో ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన కరోనా గురించి ప్రజల్లో సైతం పూర్తిగా టెన్షన్ తగ్గింది. కరోనా బారిన పడినా 10 రోజుల్లోనే కోలుకుంటూ ఉండటం, హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకున్నా తక్కువ సమయంలోనే వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడుతూ ఉండటంతో గతంలోలా ప్రజలు వైరస్ నుంచి టెన్షన్ పడటం లేదు. భవిష్యత్తులో ఇతర వ్యాధుల్లాగే కరోనా కూడా సాధారణ వ్యాధిగా మిగిలిపోయే అవకాశాలున్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. మరణాల రేటు కూడా భారీగా తగ్గడంతో ప్రజల్లో కరోనా సోకినా పెద్దగా ప్రమాదమేమీ లేదనే భావన కలుగుతోంది. గతంలో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా వల్ల ప్రజల ఆహారపు అలవాట్లలో సైతం మార్పులొచ్చాయి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడానికే ప్రస్తుతం ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు.
కరోనా సోకిన 15 శాతం మందికి మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స అవుతోంది. కరోనా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పలు ఆస్పత్రులు నాన్ కోవిడ్ రోగులను చేర్చుకునేందుకు పడకలను కేటాయిస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలోపు వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి.