Corona: అంతా రాదనుకున్నారు.. కంట్రోల్ చేశామని ఇక భయం లేదని భావించారు. వ్యాక్సిన్లు వేసుకున్నామని భరోసాగా ఉన్నారు. రూపం మార్చుకుని వచ్చినా మనల్ని ఏమీ చేయలేదనుకున్నారు. కానీ.. రాదనుకున్న మహమ్మారి మళ్లీ రానే వచ్చింది.. ఏమీ చేయదుకుంటే.. వేగంగా వ్యాపిస్తోంది. టీకా తీసుకున్నామనుకుంటే.. ప్రాణాలే తీస్తోంది. కొత్త రూపం జేఎన్–1 రూపంలో విస్తరిస్తున్న కరోనా.. దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు మళ్లీ నైట్ కర్ఫ్యూపై ఆలోచన చేస్తున్నాయి. వైరస్ కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐటీ కంపెనీల్లో టెన్షన్ మొదలైంది.
మళ్లీ వర్క్‌ఫ్రం హోమా?
కోవిడ్ మహమ్మారి ఐటి పరిశ్రమలో సంస్కరణాత్మక మార్పులను తీసుకువచ్చింది, ఇది ఇంటి నుండి పని సంస్కృతికి నాంది పలికింది. అయితే మూడు వేరియంట్ల విజృంభణ తర్వాత ఇటీవలే ఉద్యోగులకు కంపెనీల బాట పట్టారు. ఖర్చులు మిగులుతాయన్న భావనతో ఐటీ కంపెనీలు కూడా మొన్నటి వరకు ఆఫీస్‌కు రావాలన్న నిబంధనను పెద్దగా పట్టించుకోలేదు. అయితే, కోవిడ్ సమయంలో ఇంటి నుంచి పనిచేసిన కొంతమంది ఖాళీ సమయాల్లో ఇతర కంపెనీల ప్రాజెక్టులు(మూన్‌లైట్) చేస్తున్నారని గుర్తించారు. దీంతో తమ కంపెనీకి నష్టం కలుగుతుందని, రహస్యాలు ఇతర కంపెనీలకు తెలిసే అవకాశం ఉందని భావించిన కంపెనీలు.. వర్క్‌ఫ్రం హోం ఎత్తేశాయి. దీంతో ఇటీవలే దాదాపు 95 శాతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మళ్లీ ఆఫీస్‌లకు వెళ్తున్నారు.
జేఎన్–1 వ్యాప్తితో..
కరోనా కొత్త వేరియంట్ జేఎన్–1 కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. పెద్దగా ముప్పులేదని వైద్యులు చెబుతున్నా.. వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉంటోంది. రోజు రోజుకూ కేసులు మూడంకెల్లో నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు కేరళకే పరిమితమైన కోవిడ్ మరణాలు తాజాగా ఏపీ, తెలంగాణలోనూ నమోదయ్యాయి. తెలంగాణలో ఇద్దరు, ఆంధ్రాల్లో ఒకరు జేఎన్–1 కారణంగా మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు మళ్లీ పునరాలోచనలో పడ్డాయి. ఐటీ దిగ్గజ కంపెనీ విప్రోతో సహా ప్రముఖ కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రం హోం విధించాలని ఆలోచన చేస్తున్నాయి. విప్రో తన ఉద్యోగుల కోసం ఇటీవల హైబ్రిడ్ మోడల్‌ను తప్పనిసరి చేసింది. ఆఫీసులో మూడు రోజులు ఇంటి వద్ద రెండు రోజులు పనిచేయాలని నిబంధన విధించింది. తాజాగా కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కంపెనీ తన ఉద్యోగులను జాగ్రత్తగా ఉండాలని కోరింది. కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే వర్క్ ఫ్రం హోం తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న కేసులు..
ఇదిలా ఉంటే దేశంలో గత 24 గంటల్లో 4,100 కి పైగా కేసులు నమోదయ్యాయి, తెలంగాణ, ఏపీలో మరణాలు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో చాలా ఐటీ కంపెనీలు వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమయ్యాయి. విప్రో వర్క్ ఫ్రం హోంను తీసుకువస్తే దేశంలోని చాలా కంపెనీలు అదేబాటలో నడిచే అవకాశం ఉంది.