చైనా దేశం నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇతర దేశాల్లో వైరస్ ప్రభావం పెద్దగా లేకపోయినా మన దేశంలో మాత్రం రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేసిన వ్యాక్సిన్ అన్ని రకాల కరోనా వైరస్ లకు చెక్ పెట్టగలదని తెలుస్తోంది. శాస్త్రవేత్తలు కోతులు, ఎలుకలపై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.
మానవులపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందని మానవులపై కూడా ఇదే తరహా ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని డ్యుక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. కరోనా వైరస్ లోని ప్రోటీన్ పై ఉండే రెసెప్టార్ బైండింగ్ డొమైన్ పై శాస్త్రవేత్తలు ప్రధానంగా దృష్టి పెట్టారు. అచ్చంగా ఈ భాగంలా ఉండే నానో రేణువును శాస్త్రవేత్తలు తయారు చేశారు.
ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ వ్యాక్సిన్ మెరుగైన పనితీరును చూపించిందని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ ద్వారా కరోనాలోని కొత్త రకాలతో పాటు గబ్బిలాల్లోని సార్స్ సంబంధ వైరస్ లను కూడా నిర్వీర్యం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతున్నా కరోనా కేసులు తగ్గడం లేదు.
కేంద్రం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేస్తే మాత్రమే సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరి కేంద్రం లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాల్సి ఉంది.