
కరోనా వైరస్ బారిన పడిన వాళ్లకు యూనివర్సిటీ కాలేజ్ లండన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ద లాన్సెట్ హెల్దీ లాంగెవిటీ పేరుతో శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టగా ఈ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజా అధ్యయనంలో ఒకసారి కరోనా సోకిన వాళ్లకు మరోసారి వైరస్ సోకే అవకాశాలు తక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో సహజ రోగనిరోధకత పది నెలల పాటు ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ కల్పిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
2,111 మందిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. కోవిడ్ యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించి ఒకసారి కరోనా వచ్చి ఇళ్లలో ఉంటున్నవారికి రీ-ఇన్‌ఫెక్షన్ ముప్పు 85%, వైద్య సిబ్బందికి 60% తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూసీఎల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇన్‌ఫార్మేటిక్స్ పరిశోధనకర్త మరియా రుతికోవ్ దాదాపు 10 నెలల పాటు వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లే ఒక విధంగా అదృష్టవంతులని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడిన వాళ్లు సెకండ్ వేవ్ లో వైరస్ బారిన పడలేదని కోలుకున్న వాళ్లలో పెరిగిన యాంటీబాడీల ప్రభావం వల్లే కరోనా రెండోసారి సోకలేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కరోనాని ఒకసారి జయించినవారిలో కేవలం 14 మందికే 2,111 మందిలో కరోనా సోకింది.
మరోవైపు కరోనా ఇప్పటివరకు సోకని వాళ్లు వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే దాదాపు ఏడాది పాటు వైరస్ నుంచి రక్షణ కలిగే అవకాశం ఉంది.