కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కరోనా ఫస్ట్ వేవ్ లో వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడేవాళ్లకు ఎక్కువగా కరోనా సోకగా సెకండ్ వేవ్ లో మాత్రం యువత ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మాత్రం వైరస్ బారిన పడకపోవడం గమనార్హం. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నారు. థర్డ్ వేవ్ లో చిన్నారులపై కరోనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా ముప్పును ఎదుర్కోవడం గురించి ప్రధానంగా దృష్టి పెట్టింది. తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది చిన్నారులు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
ఈ చిన్నారులలో 8000 మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందే పరిస్థితులు ఏర్పడవచ్చు. 1 శాతం చిన్నారులకు మాత్రం మల్టీ సిస్టం ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ సమస్య వేధించే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఆస్పత్రులు, భోదనాస్పత్రులలో పిల్లల వైద్యానికి అవసరమైన పడకల సంఖ్యను పెంచనుంది. కరోనా థర్డ్ వేవ్ రెండు నుంచి మూడు నెలలు ఉండే అవకాశం ఉంది.
చిన్నారులకు అవసరమయ్యే మందులు లభ్యమయ్యేలా అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారని తెలుస్తోంది. ప్రస్తుతం నిలోఫర్ లో 82 మంది శిశువులు కరోనాకు చికిత్స పొందుతుండగా వీరిలో 12 మంది శిశువులు నవజాత శిశువులే కావడం గమనార్హం. చిన్నారుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు కరోనా బారిన పడకుండా మాస్క్ ధరించేలా, భౌతిక దూరం పాటించేలా తరచూ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకునేలా తల్లిదండ్రులు చర్యలు చేపట్టాలి.