నటీనటులుః మనోజ్ బాజ్ పేయి, సమంత, ప్రియమణి తదితరులు
దర్శకత్వంః రాజ్ అండ్ డీకే
స్ట్రీమింగ్ః అమెజాన్ ప్రైమ్
రిలీజ్ డేట్ః 03 జూన్, 2021
రేటింగ్ః 3.5/ 5
ఓటీటీ అంటే.. ఏదో లోబడ్జెట్ మూవీస్ ప్లాట్ ఫామ్.. సెకండరీ గ్రేడ్ సినిమాలు వెబ్ సిరీస్ గా తెరకెక్కుతుంటాయనే ఫీలింగ్ చాలా మంది ఆడియన్స్ లో ఉండేది. కానీ.. అది పొరపాటు అని నిరూపించిన వెబ్ సిరీస్ లలో ఒకటి ‘ది ఫ్యామిలీ మెన్’. సంచలన విజయం విజయం నమోదు చేసిన మొదటి సీజన్.. ప్రేక్షకులను రెండో సీజన్ కోసం వెయిట్ చేసేలా చేసింది. దేశంతోపాటు ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా రెండో సీజన్ కోసం ఎదురు చూశారంటే అతిశయోక్తి కాదు. మరి, ఈ సెకండ్ సీజన్ ఎలా ఉందో చూద్దాం.
శ్రీలంకలోని తమిళుల అస్థిత్వం కోసం ఎల్టీటీఈ సాగించిన పోరు ఛాయలు ఈ సినిమాలో కనిపించడం విశేషం. ఆ విధంగా భారత్ – శ్రీలంక – లండన్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లుగా సాగిన సీజన్-2.. తమిళ టెర్రరిస్టు సుబ్బు అరెస్టుతో ప్రారంభం అవుతుంది. శ్రీలంక తమిళ నాయకుడు భాస్కరణ్ తమ్ముడు అయిన సుబ్బును పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టే క్రమంలో.. బాంబ్ బ్లాస్టులో మరణిస్తాడు. దీంతో.. ఇండియా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు భాస్కరణ్.. పాకిస్తాన్ మేజర్ సమీర్ తో చేతులు కలుపుతాడు. అలా దేశప్రధాని బసు మీద దాడికి వ్యూహం రచిస్తారు. ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది.
మొదటి పార్ట్ రాజధానిలో గ్యాస్ లీక్ ఘటనతో ముగుస్తుంది. దీన్ని అరికట్టేందుకు సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్ పేయి) ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ.. అది ఉగ్రవాద చర్య అని కాకుండా.. ఏదో ఫ్యాక్టరీ గ్యాస్ లీకైందని అధికారులు ప్రకటిస్తారు. దీంతో.. శ్రీకాంత్ తివారి తన ఏజెంట్ ఉద్యోగాన్ని వదిలేసి సాఫ్ట్ వేర్ ఎంప్లాయిగా మారిపోతాడు. కానీ.. తన మనసు మాత్రం సీక్రెట్ ఏజెంట్ వైపే లాగుతూ ఉంటుంది. ఇటు తన ఇంట్లో భార్య సుచిత్ర (ప్రియమణి)తో సంబంధాలు సరిగా ఉండవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఇటు నచ్చని ఉద్యోగంలో ఇమడలేకపోతాడు. దీంతో.. అనివార్యంగా మళ్లీ ఏజెంట్ ఉద్యోగంలో చేరిపోతాడు.
రెండో ఎపిసోడ్ లో రాజీ పాత్రలో సమంత ఎంట్రీ ఇస్తుంది. ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ఒంటరి అమాయకపు ఆడపిల్లగా కనిపిస్తుంది సమంత. కానీ.. తాను తమిళ ఉగ్రవాదుల స్లీపర్ సెల్ సభ్యురాలు అని తేలడంతో అందరూ ఆశ్చర్యపోతారు. తమ నాయకుడు అప్పజెప్పిన మిషన్ కోసమే అక్కడ పనిచేస్తుంటుంది. అయితే.. ఈ విషయాన్ని పసిగట్టిన ఫ్యాక్టరీ యజమాని తన కోరిక తీర్చాలని అంటాడు. లేదంటే పోలీసులకు చెబుతానని బెదిరిస్తాడు. దీంతో.. అతడిని హత్యచేస్తుంది. ఈ హత్య కేసులో భాగంగా సమంత కోసం పోలీసులు తిరుగుతుంటారు. మరి సమంత దొరుకుతుందా? తాను స్లీపర్ సెల్ అని తెలుస్తుందా? అసలు తమిళనాయకుడు భాస్కరణ్ ప్లాన్ ఏంటీ? అది అమలవుతందా? పోలీసులు ఈ మిషన్ ను ఛేదిస్తారా? అనేది మిగతా కథ.
మొత్తం తొమ్మిది ఎపిసోడ్లలో ఒకటీ రెండు కాస్త డల్ గా అనిపించినప్పటికీ.. మొత్తంగా సిరీస్ మొత్తం ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పొచ్చు. మనోజ్ బాజ్ పేయి, సమంత, ప్రియమణి తమ పాత్రలకు ప్రాణం పోశారని చెప్పొచ్చు. శ్రీలంక ఆర్మీ చేతిలో అన్యాయానికిగురైన తమిళుల ప్రతినిధిగా సమంత నటన అద్వితీయం అని చెప్పొచ్చు. కుటుంబ సమస్యలు, ఉద్యోగ సవాళ్లను ఎదుర్కొనే వ్యక్తిగా మనోజ్ బాజ్ పేయి అత్యున్నతమైన నటనను ప్రదర్శించారు. ప్రియమణి కూడా సగటు గృహిణిగా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఇక, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దర్శకద్వయం రాజ్ డీకే గురించి. సిరీస్ మొత్తం ట్విస్టులతో, ఆకట్టుకునే కథనంతో అద్భుతంగా నడిపించిన దర్శకులు.. ప్రేక్షకుల చేత అంగీకరింపజేశారని చెప్పొచ్చు. సస్పెన్స్ ను మరింత ఎలివేట్ చేసే బీజీఎం కేక పెట్టిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ గా నిలుస్తుంది. మొత్తంగా.. మన దేశంలోనే ఇప్పటి వరకు తెరకెక్కిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో ది ఫ్యామిలీ మెన్ సిరీస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే.. మూడో సిరీస్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు దర్శకులు. తద్వారా ప్రేక్షకులను మళ్లీ ఎదురు చూసేట్టు చేశారు.