కాంగ్రెస్ పరిస్థితి తలుచుకుంటే జాలేస్తుంది. ఎక్కడనుంచి ఎక్కడకు జారింది. 1980 దశకంవరకు దేశంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ ఆ తర్వాత పడుతూ లేస్తూ 2014 తర్వాత పూర్తిగా అచేతన స్థితికి చేరింది. దీని పతనం వాస్తవానికి ఎప్పుడో ప్రారంభమయ్యింది. కాకపోతే దాన్ని గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవటంతో 2004 లో అధికారంలోకి వచ్చినా, 2009 లో తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకున్నా అది వాపే గాని బలంకాదని గుర్తించలేకపోయింది. అప్పటికే అనేక రాష్ట్రాలు తన గుప్పిటలోనుంచి జారిపోవటం గమనించి సాహసోపేత నిర్ణయాలతో తిరిగి పాత వైభవాన్ని పునరుద్ధరించే పని చేయకుండా కేవలం ‘చల్తే హై గాడి’ పంధాలో పార్టీని నడపటంతో ఈ దుస్థితి దాపురించింది. ఎవరైనా సున్నితంగా హెచ్చరించినా దాన్ని పార్టీ వ్యతిరేక చర్యగా చూపించటం పరిపాటి అయ్యింది. వందిమాగధుల్ని పక్కనపెట్టుకొని కుటుంబ ఆస్తిగా పార్టీని నడపటంతో మొదటికే మోసమొచ్చింది. నిజంగానే ‘కాంగ్రెస్ విముక్త భారతం’ దిశగా స్వీయ ధ్వంస రచన చేసుకుంటూ పోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచిందా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఇంత దయనీయమైన స్థితిలో కాంగ్రెస్ ని ఎప్పుడూ ఊహించుకోలేదు. ఈ పతనావస్థ దశల్ని సంక్షిప్తంగా తరచి చూద్దాం.
రాష్ట్రాలవారిగా పతనం
దేశంలో జాతీయ పార్టీగా మనుగడ సాగాలంటే రాష్ట్రాల్లో బలంగా వుండాలి. అప్పుడే జాతీయ స్థాయిలో బలంగా వుంటుంది. ఇది ప్రాధమిక సూత్రం. కానీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో పార్టీని కేవలం అధినాయకత్వ గులాములతో నింపేసింది. ప్రజాబలం వున్న నాయకుల్ని బలహీనపర్చటం తన క్రీడలో భాగంగా చేసుకుంది. ఈ పంధాని ఇందిరా గాంధీ అమలుచేయటం ప్రారంభించింది. అప్పుడే ప్రాంతీయ పార్టీలు సుస్థిర స్థానాన్ని రాష్ట్రాల్లో సంపాదించుకోగలిగాయి. 1960 దశకంలో తమిళనాడులో ఇదే జరిగింది. డిఎంకె ఈ అవకాశాన్ని సొమ్ముచేసుకొని అధికారంలోకి రాగలిగింది. ఆ తర్వాత ఇంతవరకు అక్కడ కాంగ్రెస్ పుంజు కోలేకపోయింది. 1970 దశకంలో పశ్చిమ బెంగాల్ లోను ఇదే జరిగింది. సిపిఎం నాయకత్వాన అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఇంతవరకు కాంగ్రెస్ కోలుకోలేకపోయింది. అయితే ఈ రెండు రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినా 1980 దశకం వరకూ కాంగ్రెస్ ఆ రాష్ట్రాల్లో ఉనికిని కోల్పోలేదు. అంటే ఆరెండు రాష్ట్రాల్లో జరిగింది ఓ ఎక్సెప్సన్ లాగానే చూడటం జరిగింది. నిజమైన నష్టం 1990 దశకాల్లో మొదలయ్యింది. మండల్, కమండల్, బహుజన్ రాజకీయాల్లో కాంగ్రెస్ పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్,బీహార్ ల్లో అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈరెండు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయిన పార్టీ జాతీయ పార్టీగా మనుగడ సాగించటం కష్టం. ఇప్పుడు అదే జరిగింది. వీటితో పాటు ఒడిశా లాంటి రాష్ట్రాల్లో కూడా క్రమ క్రమేనా క్షీణించటం మొదలయ్యింది. 21వ శతాబ్దంలో ఇది పరాకాష్టకు చేరింది. దక్షిణాదిలో అత్యంత బలంగా వున్న రాష్ట్రం అవిభక్త ఆంధ్రప్రదేశ్. చివరకు విభజన రాజకీయాల్లో ఆంధ్రలో కాంగ్రెస్ పూర్తి ఉనికిని కోల్పోయింది. తెలంగాణాలో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 2014 తర్వాత మోడీ ప్రభంజనంలో ఇంకా పునాదులు దెబ్బతిన్నాయి. మధ్యలో 2018 చివరలో జరిగిన మధ్యప్రదేశ్,రాజస్తాన్,ఛత్తీస్ ఘడ్ లో తిరిగి జవసత్వాలు పుంజుకుంది. కానీ అది బలుపుకాదు అని తెలుసుకోలేకపోయింది. అప్పటికే సుదీర్ఘకాలం పాలన చేస్తున్న బిజెపి పై వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత వలన కాంగ్రెస్ లబ్ది పొందింది తప్పితే పార్టీ తిరిగి చలనశీలంగా తయారవటం వలన కాదు. చివరకు మిగిలింది ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్ , కర్ణాటక, కేరళ మాత్రమే. ఇక్కడ అధికారంలోనో ప్రతిపక్షంలోనో వుంది. త్వరలో మహారాష్ట్ర, తెలంగాణాలోనూ ఉనికి కోల్పోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవలి ఉప ఎన్నికలు రాష్ట్రాల్లో వేగవంతమైన పార్టీ పతనాన్ని సూచిస్తున్నాయి.
సామాజికపరంగాకూడా అధ్వానస్థితిలోనే
కాంగ్రెస్ ఒకనాడు అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించేది. ఇప్పుడు కాంగ్రెస్ ఇందులో ఏ ఒక్కదానికి చెందిందిగా చెప్పలేము. ముందుగా చెప్పాల్సివస్తే మధ్యతరగతి వర్గం, మహిళలు, యువకులు ఏ ఒక్క వర్గం ఈ రోజు కాంగ్రెస్ వైపు లేరు. అలా అని పేదలు వున్నారా అంటే అదీ లేదు. అందుకనే అన్ని వర్గాలని దూరం చేసుకుందని చెప్పొచ్చు. ఇక సామాజికపరంగా చూస్తే ఒకనాడు అన్ని కులాలు కాంగ్రెస్ ని సమంగా ఆదరించాయి. కాని మండల్ రాజకీయాల తర్వాత వెనకబడిన కులాలు దూరమయ్యాయి. బహుజన రాజకీయాల ఒరవడిలో దళితులూ దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట దళితులూ గుంప గుత్తగా వైఎస్ ఆర్ సిపి వైపు మొగ్గు చూపారు. కమండల్ రాజకీయాల్లో, ముఖ్యంగా మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత అగ్రవర్ణాలు పూర్తిగా బిజెపి వైపు మొగ్గు చూపారు. చివరకు కాంగ్రెస్ కి ఏ సామాజిక వర్గం కోర్ బేస్ గా లేకుండా పోయింది. ఇక మతపరంగా చూస్తే ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వరకు కూడా హిందువులు కాంగ్రెస్ పై అనుమాన పడలేదు. ముస్లిం అనుకూల పార్టీగా కొన్ని సందర్భాల్లో ముద్రపడినా హిందువులు కాంగ్రెస్ పై ఇంకా విశ్వాసాన్ని కొనసాగించారు. కాని రాను రాను పరిస్థితిల్లో మార్పులొచ్చాయి. రామమందిరం విషయంలో బిజెపి తీసుకున్న వైఖరితో హిందువుల్లో మార్పురావటం మొదలయ్యింది. దానితోపాటు కాంగ్రెస్ రాజకీయాలు రాను రాను ముస్లిం అనుకూలంగా, మెజారిటీ హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉంటున్నాయని ప్రజల్ని నమ్మించటం లో బిజెపి సఫలమయ్యింది. 2014 తర్వాత మరీ ఎక్కువగా కాంగ్రెస్ కి హిందువులు దూరమయ్యారు. రెండోవైపు ముస్లింలు కూడా బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ, బిఎస్ పి వైపు మొగ్గు చూపారు. అదే బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ వైపు సమీకరించబడ్డారు. ఇంకో పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో అప్పటికే ముస్లింలు సిపిఎం గొడుగున చేరారు. ఇంకో ముస్లిం అధిక జనాభా కలిగిన అస్సాంలో కాంగ్రెస్ నుంచి దూరం జరిగి బద్రుద్దీన్ నాయకత్వంలోని అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో సమీకృత మయ్యారు. కేరళ, జమ్మూ-కాశ్మీర్ లో మొదట్నుంచీ వేరే పార్టీల్లో ఉంటూ వచ్చారు. అంటే కాంగ్రెస్ పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిలాగా తయారయ్యింది. ఇంకా ఎక్కడైనా మిగిలి వుంటే అదికాస్తా ఇప్పుడు ఒవైసీ చేజిక్కించు కుంటున్నాడు. నిన్న, మొన్న బీహార్ లోని సీమంచల్ లో ఇదే జరిగింది. రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ జిల్లాలైన ముర్షిదాబాద్,మాల్డా,ఉత్తర దినాజ్ పూర్ లో కూడా ఒవైసీ పోటీ చేస్తుండటంతో అక్కడా కాంగ్రెస్ పని గోవిందా అని పరిశీలకులు చెబుతున్నారు. అంటే అన్నివర్గాల్లో,అన్నికులాల్లో, అన్నిమతాల్లో కూడా కాంగ్రెస్ కి స్థానం లేకుండా పోయింది. ఇది స్వయంకృతాపరాధం గా చెప్పుకుంటున్నారు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడటమంటే ఇదేనేమో. పాపం కాంగ్రెస్ , ఎంత దయనీయమైన పరిస్థితి. ( మరో భాగం లో మిగతా కాంగ్రెస్ కధను తెలుసుకుందాం). సెలవు .
Also Read: దయనీయమైన స్థితిలో కాంగ్రెస్ (రెండో భాగం)
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Congress in pitiable situation part1
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com