
తిరుపతి సభలో ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు జనసేనాని పవన్ కళ్యాణ్. జగన్ ది రౌడీ రాజ్యం అని.. పులివెందుల దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యారాజకీయాలకు నెలవు అని దుమ్మెత్తిపోశారు. దానికి వైసీపీ నేతలు భగ్గుమన్నారు. పవన్ పై విరుచుకుపడ్డారు.
తిరుపతి సభతో పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఏపీ రాజకీయాల్లో చిచ్చు రేగింది. పవన్ పేరు చెబితే వైసీపీ నేతలు ఊగిపోతున్నారు. అంతలా జగన్ ను, పులివెందులపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇందంతా జరిగిన వేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా ఏపీలోనూ ఈనెల 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. నిర్మాత దిల్ రాజు ఇప్పటికే తెలంగాణ సర్కార్ తో తనకున్న సంబంధాల దృష్ట్యా రిలీజ్ అయిన మొదటి రెండు మూడు రోజులు ఆరు షోలు థియేటర్లలో ప్రదర్శించేందుకు సైలెంట్ గా అనుమతులు పొందారని టాక్.
కానీ ఇప్పుడు ఏపీలో చిక్కు వచ్చిపడింది. జగన్ ను అంతగా పవన్ తిట్టడంతో నిర్మాత దిల్ రాజు డిఫెన్స్ లో పడ్డారు. ఏపీలో ‘వకీల్ సాబ్’ ఆరు షోల కోసం ఇప్పుడు లాబీయింగ్ మొదలు పెట్టారట.. దిల్ రాజుకు వైసీపీతో, వైసీపీ మంత్రులు నేతలతో బంధుత్వాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తనకు సన్నిహితుడైన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఈ మేరకు వకీల్ సాబ్ ఆరు షోల కోసం అనుమతి ఇప్పించాలని కోరాడడని ఇన్ సైడ్ టాక్.
ఆంధ్రలో జగన్ ను ఒప్పించి వైవీ సుబ్బారెడ్డి ‘వకీల్ సాబ్’ ఆరు షోలకు అనుమతి ఇప్పిస్తాడా? లేక పవన్ తిట్లకు వైసీపీ ప్రభుత్వం ఏమైనా షాకిస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటికే బినిఫిట్ షోల టికెట్లను భారీగా అమ్మేసి థియేటర్ యాజమాన్యాలు రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. జగన్ పాత పగలతో అడ్డుకుంటారా? లేదా అనుమతిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.