‘సైరా’ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చేసి తెల్లవారిని ఎదురించిన ఓ రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడి చరిత్రను మెగా స్టార్ చిరంజీవి తెలుగు ప్రజలకు పరిచయం చేశాడు. అలాంటి యోధుడికి ఇప్పుడు ఏపీ సీఎం జగన్ అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయానికి విప్లవవీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పేరు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి ఇలాంటి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. జగన్ చేసిన ప్రకటన నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
అలనాటి స్వాతంత్ర్య సమరయోధుడికి దక్కిన అసలైన గౌరవం ఇది అని.. అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్ లో నేను నటించడం.. ఆయన పాత్రను నేను పోషించడం నా అదృష్టం అని చిరంజీవి పేర్కొన్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా చిరంజీవి హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ తెరకెక్కింది. చిరంజీవియే నిర్మాతగా మారి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తీశాడు.