
టెస్టుల్లో ఓటమితో మొదలుపెట్టి సిరీస్ గెలిచింది. టీ20లోనూ అదే కథ.. ఇప్పుడు వన్డేల్లోనూ మాత్రం ఇంగ్లండ్ పై గెలుపుతో బోణీ కొట్టింది ఇండియా. రెండో వన్డేలో ఇండియా గెలిస్తే ఇక మూడు సిరీస్ ల విజయాలు. అద్భుతం జరుగుతుంది. టెస్టు, టీ20 లను కోల్పోయిన ఇంగ్లండ్ ఇప్పుడు వన్డే సిరీస్ ను కోల్పోకూడదని గట్టి పట్టుదలతో ఉంది. రెండో వన్డేలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
టీ20లను తృటిలో కోల్పోయిన మోర్గాన్ సేన రెండో వన్డేలో గెలవాలని పట్టుదలతో ఉంది. శుక్రవారం టీం ఇండియాను ఢీకొట్టేందుకు రెడీ అయ్యింది.
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. మైదానం చుట్టూ షాట్లు కొట్టగల అతడి సామర్థ్యం వన్డేల్లో ఎంట్రీతో ఎటు వైపు దారితీస్తుందో చూడాలి. ఇక వన్డేల్లో జడేజా స్థానంలో కృణాల్ పాండ్య తొలి మ్యాచ్ లోనే ఆఫ్ సెంచరీతో చెలరేగి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.
ఇక ఓపెనర్ శిఖర్ ధావన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సెంచరీకి చేరువై తొలి మ్యాచ్ లో ఔట్ అయ్యాడు. రోహిత్, శిఖర్ ఆడితే తిరుగుండదు. కీపర్ గా కేఎల్ రాహుల్ కంటిన్యూ కానున్నాడు. ఇక బౌలింగ్ లో భారీగా పరుగులు ఇచ్చిన కుల్ దీప్ స్థానంలో యజ్వేంద్ర చాహల్ జట్టులోకి వస్తాడని అంచనా వేస్తున్నారు. భువనేశ్వర్, శార్ధూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ కొనసాగుతారు. సిరాజ్ లేదా నటరాజన్ లకు అవకాశం దక్కవచ్చు. పాండ్య సోదరులు ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంది.
ఇక ఇంగ్లండ్ బలంగా ఉంది. కానీ వారి వైఫల్యమే కొంప ముంచుతోంది. ఓపెనర్లు సెంచరీ దాటించి ఈజీ చేసినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో ఇంగ్లండ్ తొలి మ్యాచ్ లో ఓడింది. మిడిల్ ఆర్డర్ గట్టిగా ఆడితే వారికి తిరుగు ఉండదు.
ఇక గాయపడ్డ కెప్టెన్ మోర్గాన్ ఆడుతాడా? సామ్ బిల్లింగ్స్ బరిలోకి దిగుతాడా వేచిచూడాలి. వీరిద్దరూ రెండో వన్డేలో ఆడటంపై స్పష్టత లేదు. స్పిన్నర్లు తేలిపోగా.. ఫాస్ట్ బౌలర్లు ఇంగ్లండ్ కు బలంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే రేపటి మ్యాచ్ ఇంగ్లండ్ కు డూ ఆర్ డై. ఆ మ్యాచ్ ఓడితే ఇక ఇంగ్లండ్ మూడు సిరీస్ లు కోల్పోయినట్టే. ఇక ఇండియా ఇది గెలిస్తే సిరీస్ విజయం దక్కినట్టే. సో ఈ మ్యాచ్ ఇంగ్లండ్, ఇండియాలకు కీలకంగా మారింది.