Homeబిజినెస్Anand Mahindra Travel Inspiration: భూలోక స్వర్గాన్ని పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా.. మనదేశంలో ఈ...

భూలోక స్వర్గాన్ని పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా.. మనదేశంలో ఈ ప్రాంతం ఎక్కడుంది? ఎలా వెళ్లాలంటే? వీడియో వైరల్

Anand Mahindra Travel Inspiration: జీవితం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండకూడదు. ముఖ్యంగా నాలుగు గోడలకు పరిమితం కాకూడదు. భూమ్మీద బతికేది కొంత కాలం కాబట్టి.. ఆ కొంతకాలాన్ని కూడా ఆనందంగా జీవించాలి. అనుభూతులను నింపుకోవాలి. జ్ఞాపకాలను పోగేసుకోవాలి. సంతోషాలను గుండె నిండా నింపుకోవాలి. అప్పుడే జీవితానికి సార్ధకత లభిస్తుంది. సంతృప్తి, సంతోషంతో చరమాంకం సాగుతుంది. “ఉన్నచోటే ఉండకండి. ప్రకృతిని కాస్త చూడండి. ప్రకృతి పంచె వెలుగులో ఆవిష్కృతమయ్యే మిగతా రంగులను చూడండి. అప్పుడు మీకు ప్రకృతి కొత్తగా కనపడుతుంది. ఆ కొత్తలో మిమ్మల్ని మీరే మైమరిచిపోతారు. ప్రకృతికి మరింత దగ్గరవుతారని” ఫ్రెంచ్ దేశానికి చెందిన ఓ తత్వవేత్త తను రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు. దీనిని బట్టి విహారయాత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుంది.. ప్రకృతికి ఎంతటి విలువ ఉంటుందనేది తెలుసుకోవచ్చు.

Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?

మన దేశం గత కొంతకాలంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. అప్పటిదాకా మరుగునపడిన స్థలాలు.. ఇతర ప్రదేశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే టూరిజం అనేది పెట్టుబడి లేని వ్యాపారం. కాలుష్యం, చెట్లు నరికివేత, ఇటువంటి ప్రకృతి విరుద్ధమైన అంశాలతో ముడిపడి ఉండని వ్యవహారం. ఉదాహరణకు యూరప్ లో ఉన్న స్విట్జర్లాండ్ తీసుకుంటే.. అది భూలోక స్వర్గంగా వెలుగొందుతోంది. కేవలం పర్యాటకం మీదనే ఆ దేశం ఆదాయాన్ని సంపాదిస్తోంది. పర్యాటకంగా అభివృద్ధి చెందడమే కాదు.. వచ్చే యాత్రికులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే ఆ ప్రాంతం లాంటి సందర్శనీయ స్థలాలు చాలానే ఉన్నాయి. కాకపోతే సరైన ప్రచారం లేకపోవడం వల్ల వెలుగులోకి రాలేకపోతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి అద్భుతమైన యాత్ర స్థలాలు వెలుగులోకి వస్తున్నాయి. మనదేశంలోని ప్రఖ్యాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో భూతల స్వర్గాన్ని పరిచయం చేశారు. ఆ వీడియో చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు.

మన దేశంలో అద్భుతమైన యాత్ర స్థలాలు ఉన్న ప్రాంతంగా కేరళ రాష్ట్రం పేరుపొందింది. కేరళ రాష్ట్రాన్ని భగవంతుడి సొంత ప్రదేశంగా పేర్కొంటుంటారు. కేరళ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. అందులో కడమక్కుడి ఒకటి. ఇది కొచ్చి నగరానికి దగ్గర్లోనే ఉంటుంది. బ్యాక్ వాటర్ ప్రాంతంగా ఇది పేరు పొందింది. చుట్టూ నీళ్లు.. మధ్యలో రోడ్లు.. నివాస ప్రాంతాలతో ఈ ప్రాంతం వెనిస్ నగరాన్ని తలపిస్తుంది.. ఈ ప్రాంతాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ రాత్రిపూట రిసార్ట్స్ లో ఉంటూ.. చేపల కూరతో ఆహారాన్ని తినడం అద్భుతంగా భావిస్తుంటారు. ఇక్కడ ఈ జలాల్లో కూడా విభిన్నమైన చేపలు లభిస్తాయి. వచ్చే యాత్రికుల కోసం ఇక్కడ రిసార్ట్స్ లలో ప్రత్యేకమైన వంటకాలను సిద్ధం చేస్తుంటారు. ఇక్కడ సీ ఫుడ్ అద్భుతంగా ఉంటుంది. ఈ జలాలలో విహరిస్తూ.. సీ ఫుడ్ తింటూ పర్యాటకులు ఆస్వాదిస్తుంటారు.. ఇక ఇదే విషయాన్ని ఆనంద్ మహేంద్ర కూడా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ” కడమక్కుడి అనేది కేరళ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ప్రదేశాలలో ముందు వరుసలా ఉంటుంది. దీనిని తరచూ సందర్శించాలని అనుకుంటాను గానీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ డిసెంబర్లో నాకు కేరళ రాష్ట్రంలో ఒక అధికారిక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంతానికి కచ్చితంగా వెళ్తాను. ఈ ప్రాంతానికి వెళ్ళాలని నా జాబితాలో కూడా రూపొందించుకున్నానని” ఆనంద్ మహీంద్రా తను పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.

ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటున్నది. చాలామంది ఈ వీడియోని చూసి మంత్రముగ్ధులవుతున్నారు.”మీరు పోస్ట్ చేసిన వీడియో చాలా బాగుంది. కచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్లాలనిపిస్తోంది. మనదేశంలో ఇంతటి అద్భుతమైన ప్రదేశాలు ఉండడం గొప్ప విషయం. కేరళలో ఇలాంటి ప్రాంతం ఒకటుందని ఇప్పటివరకు తెలియదు. మీ ద్వారా మాకు తెలిసింది. దానిని చూస్తుంటే వెనిస్ నగరంలాగా కనిపిస్తోంది. కచ్చితంగా అక్కడికి వెళ్తాం. ఆ ప్రాంత అందాన్ని ఆస్వాదిస్తాం. అక్కడి రుచులను ఆరగిస్తామని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కేరళ టూరిజం కూడా ఈ ప్రాంతాన్ని తెగ ప్రమోట్ చేస్తోంది. ఇక్కడ అధునాతన సౌకర్యాలను కల్పించింది. వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకమైన వంటకాలను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular