Car Safety Tips: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో రోడ్లపై నీరు నిల్వ ఉండటం, జారుడు రోడ్లు, తక్కువ విజిబిలిటీ వంటి కారణాలతో కారు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి సొంత కారు ఉన్నవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నేటి కాలంలో చాలా మంది సొంత కారును కలిగి ఉన్నారు. అయితే వ్యక్తిగత, కార్యాలయ పనుల కారణంగా కారును పెద్దగా పట్టించుకోరు. కానీ చిన్న నిర్లక్ష్యం పెద్ద ఖర్చులకు కారణం అవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటోమోబైల్ నిపుణులు తెలుపుతున్నారు. మరి ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే?
1. టైర్ల ట్రెడ్ తక్కువగా ఉంటే..
వర్షాకాలంలో కారుకు అత్యంత ముఖ్యమైన భాగం టైర్లు. టైర్ల ట్రెడ్ (గ్రిప్) తక్కువగా ఉంటే నీటిపై కారు జారిపోయే ప్రమాదం ఉంటుంది. టైర్లలో సరైన గాలి ఒత్తిడి ఉండేలా చూసుకోవాలి. పాతబడిన లేదా పగుళ్లు వచ్చిన టైర్లను వెంటనే మార్చడం మంచిది. టైర్ల గ్రిప్ బాగుంటే బ్రేకింగ్ కూడా మెరుగ్గా పనిచేస్తుంది.
2. బ్రేకింగ్ చాలా ఇంపార్టెంట్..
వర్షంలో బ్రేకింగ్ దూరం సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రేక్ ప్యాడ్లు, బ్రేక్ ఆయిల్, బ్రేక్ సిస్టమ్‌ను సర్వీస్ చేయించుకోవాలి. అలాగే విండ్‌షీల్డ్ వైపర్లు సరిగా పనిచేయకపోతే ముందు కనిపించదు. వైపర్ బ్లేడ్లు పాడై ఉంటే వెంటనే మార్చాలి. వాషర్ ట్యాంకులో నీరు లేదా క్లీనింగ్ లిక్విడ్ నింపుకోవాలి.
3. హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు తనిఖీ చేయాలి..
వర్షంలో పొగమంచు, చీకటి కారణంగా విజిబిలిటీ తగ్గుతుంది. అందువల్ల హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంపులు, ఇండికేటర్లు, టెయిల్‌లైట్లు అన్నీ సక్రమంగా వెలుగుతున్నాయో ముందుగానే పరీక్షించాలి. అవసరమైతే లో-బీమ్ లైట్లను ఉపయోగించడం ఇతర వాహనదారులకు కూడా మీ వాహనం స్పష్టంగా కనిపించేందుకు సహాయపడుతుంది.
4. నీటితో నిండిన రోడ్లపై వెళ్లాల్సి వస్తే..
రోడ్డుపై నీరు నిల్వ ఉందని కనిపిస్తే దాని లోతు తెలియకపోతే ఆ మార్గంలో వెళ్లకపోవడం మంచిది. బలవంతంగా నీటిలోకి కారును తీసుకెళితే ఇంజిన్‌లో నీరు చేరి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం సురక్షితం.
5.సురక్షిత వేగంతోనే డ్రైవింగ్ చేయాలి
వర్షంలో వేగంగా కారు నడపడం ప్రమాదకరం. రోడ్లు జారుడుగా ఉండటంతో అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే కారు అదుపు తప్పే అవకాశం ఉంది. అందువల్ల నెమ్మదిగా ప్రయాణించాలి. ముందు వెళ్తున్న వాహనానికి సాధారణం కంటే ఎక్కువ దూరం పాటించడం మంచిది.
6.ఎలక్ట్రికల్ వ్యవస్థపై..
బ్యాటరీ, వైరింగ్, ఫ్యూజ్‌లు, ఇగ్నిషన్ వ్యవస్థ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. వర్షపు నీరు ఎలక్ట్రికల్ భాగాల్లోకి చేరితే స్టార్టింగ్ సమస్యలు రావచ్చు. కాబట్టి సర్వీస్ సమయంలో ఈ అంశాలను కూడా పరిశీలించడం అవసరం.
7.ఎయిర్ కండిషనింగ్…
వర్షంలో కారు అద్దాలపై ఆవిరి పేరుకుపోవడం సాధారణం. దీంతో డ్రైవర్‌కు బయట స్పష్టంగా కనిపించదు. ఈ సమస్యను నివారించేందుకు ఎయిర్ కండిషనర్ లేదా డిఫాగర్‌ను ఉపయోగించాలి. దీంతో అద్దాలు త్వరగా శుభ్రపడతాయి.
8.అత్యవసర సామగ్రి అవసరం..
వర్షాకాలంలో కారులో టార్చ్ లైట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, జంప్ స్టార్టర్ కేబుల్స్, టోయింగ్ రోప్, గొడుగు, పవర్ బ్యాంక్, తాగునీరు వంటి అత్యవసర వస్తువులు ఉంచుకోవడం మంచిది. టైర్ పంక్చర్ అయితే ఉపయోగపడే స్టెప్నీ, జాక్, టూల్ కిట్ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.
