Car Subscription: కొత్త కారు కొనాలని చాలామందికి ఉంటుంది. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం, రుణం తీసుకుంటే సంవత్సరాల తరబడి ఈఎంఐలు చెల్లించడం, ప్రతి ఏడాది బీమా, మెయింటెనెన్స్ ఖర్చులు భరించడం మాత్రం భారంగానే ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కార్ సబ్స్క్రిప్షన్ లేదా లీజింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. కారు పూర్తిగా మీ పేరుపైకి రాకపోయినా.. ఒప్పందం ఉన్నంతకాలం దాన్ని మీ సొంత వాహనంలా ఉపయోగించుకోవచ్చు. కాలపరిమితి ముగిసిన తర్వాత కారును తిరిగి ఇచ్చేయవచ్చు. నచ్చితే మిగిలిన విలువ చెల్లించి కొనుగోలు చేసే అవకాశం కూడా కొన్ని పథకాల్లో ఉంటుంది.
అసలు ఈ సబ్స్క్రిప్షన్ అంటే ఏమిటి?
సింపుల్‌గా చెప్పాలంటే.. కారును కొనే బదులు నిర్దిష్ట కాలానికి ఉపయోగించుకోవడం… సాధారణంగా 12 నెలల నుంచి 48 లేదా 60 నెలల వరకు వివిధ కాలవ్యవధుల్లో సబ్స్క్రిప్షన్/లీజింగ్ ప్లాన్లు ఉంటాయి. ఎంచుకున్న కారు, కంపెనీ, కాలవ్యవధిని బట్టి నెలవారీ రుసుము నిర్ణయిస్తారు. సాధారణ కారు రుణంలో ప్రతి నెలా ఈఎంఐ చెల్లిస్తే.. ఇక్కడ నెలవారీ సబ్స్క్రిప్షన్ రుసుము చెల్లించాలి. ఒప్పందం ముగిసిన తర్వాత కారును తిరిగి ఇవ్వడం, కొత్త మోడల్‌కు మారడం లేదా అందుబాటులో ఉన్న నిబంధనల ప్రకారం కారును కొనుగోలు చేయడం వంటి అవకాశాలు ఉంటాయి.
ఈ మోడల్లో అసలు ఆకర్షణ ఏంటి?
కారు కొనుగోలు చేసినప్పుడు కారు ధరతో పాటు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను, బీమా, మెయింటెనెన్స్ వంటి ఖర్చులు కూడా ఉంటాయి. సబ్స్క్రిప్షన్ ప్లాన్లలో వీటిలో కొన్ని లేదా అన్నీ ప్యాకేజీలో భాగంగా ఉండొచ్చు. అంటే.. కారు కొనుగోలు కోసం భారీ మొత్తాన్ని ముందుగా పెట్టకుండా కొత్త కారును ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి కంపెనీ నిబంధనలు ఒకేలా ఉండవు. బీమా, సర్వీసింగ్, టైర్లు, నిర్వహణ, కిలోమీటర్ల పరిమితి, డ్యామేజ్ ఛార్జీలు వంటి అంశాలు ఒప్పందాన్ని బట్టి మారవచ్చు. అందుకే కేవలం నెలవారీ రుసుమును చూసి నిర్ణయం తీసుకోకుండా మొత్తం ఒప్పందాన్ని పరిశీలించడం ముఖ్యం.
ఎవరికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది?
కొత్త కారు అంటే ఎప్పుడూ ఆసక్తే.. కానీ అదే కారును ఎక్కువ కాలం నడపాలనే ఆలోచన లేని వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు కొత్త మోడల్‌కు మారాలనుకునేవారు.. పాత కారును అమ్మడం, దాని విలువ తగ్గిపోవడం వంటి ఇబ్బందులు వద్దనుకునేవారు సబ్స్క్రిప్షన్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగుల్లో ఈ విధానానికి ఆసక్తి పెరుగుతోంది. కొన్ని సంస్థలు ఉద్యోగి అర్హతను బట్టి లీజింగ్ సదుపాయాలను అందిస్తున్నాయి. నిర్వహణ, బీమా వంటి బాధ్యతలను లీజింగ్ సంస్థ నిర్వహించడం కూడా ఉద్యోగులకు ఆకర్షణగా మారుతోంది.
ఎంత చెల్లించాలి?
ఎంచుకునే కారు, బ్రాండ్, కాలవ్యవధి, కిలోమీటర్ల వినియోగం వంటి అంశాలపై రుసుము ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ప్లాన్లలో హ్యాచ్‌బ్యాక్ కార్లకు నెలకు సుమారు రూ.11 వేల నుంచి రూ.35 వేల వరకు, సెడాన్ కార్లకు రూ.28 వేల నుంచి రూ.55 వేల వరకు, ఎస్‌యూవీలకు రూ.38 వేల నుంచి రూ.లక్ష వరకు నెలవారీ రుసుములు ఉండొచ్చు. ఉదాహరణకు మారుతీ సుజుకీ ఎంపిక చేసిన మోడళ్లకు సబ్స్క్రిప్షన్ ప్లాన్లు అందిస్తోంది. కొన్ని చిన్న కార్లకు నెలవారీ రుసుము రూ.11 వేల పరిధి నుంచి ప్రారంభమవుతుండగా.. ఖరీదైన మోడళ్లకు ఇది గణనీయంగా పెరుగుతుంది.
మరి కారు కొనడం కంటే ఇది చౌకేనా?
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నెలవారీ చెల్లింపును మాత్రమే చూసి సబ్స్క్రిప్షన్ చౌక అని నిర్ణయించలేం. కారు కొనుగోలు చేస్తే చివరికి వాహనం మీ ఆస్తిగా మారుతుంది. సబ్‌స్క్రిప్షన్‌లో మాత్రం ఒప్పందం ముగిసే సమయానికి కారు మీ సొంతం కాకపోవచ్చు. అలాగే అదనపు కిలోమీటర్లు, ముందస్తుగా ఒప్పందం ముగించడం, వాహనానికి జరిగిన నష్టం వంటి వాటికి అదనపు ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. అందుకే దీర్ఘకాలం ఒకే కారును ఉపయోగించాలనుకునేవారికి కారు కొనుగోలు చేయడం, తరచూ కొత్త మోడల్‌కు మారాలనుకునేవారికి లీజింగ్/సబ్స్క్రిప్షన్ అనుకూలంగా ఉండొచ్చు.
లగ్జరీ కార్లకూ ఇదే ట్రెండ్
ఈ విధానం కేవలం చిన్న కార్లకే పరిమితం కాలేదు. ఖరీదైన, లగ్జరీ కార్ల విభాగంలోనూ లీజింగ్ మోడల్ అందుబాటులో ఉంది. ఒకేసారి భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టకుండా కొంతకాలం ఖరీదైన కారును ఉపయోగించాలనుకునే వారికి ఇది మరో మార్గంగా మారుతోంది. నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాలు చూడండి
కారు సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు ఈ అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి
నెలవారీ రుసుము ఎంత? ప్రారంభంలో ఏదైనా డిపాజిట్ లేదా అడ్వాన్స్ ఉందా? బీమా, సర్వీసింగ్ పూర్తిగా ప్యాకేజీలో ఉన్నాయా? సంవత్సరానికి/నెలకు ఎన్ని కిలోమీటర్లు నడపవచ్చు? అదనపు కిలోమీటర్‌కు ఎంత ఛార్జీ? డ్యామేజ్ లేదా వాహనం తిరిగి ఇచ్చేటప్పుడు ఏమైనా ఛార్జీలు ఉన్నాయా?
ఒప్పందాన్ని మధ్యలో రద్దు చేస్తే ఎంత చెల్లించాలి? చివర్లో కారును కొనుగోలు చేసే అవకాశం ఉందా? చివరికి ఎవరు గెలుస్తారు?
“కారు నాది కావాలి” అనుకునేవారికి కొనుగోలు ఉత్తమం. “నాకు కొత్త కారు కావాలి.. కానీ దాన్ని ఎప్పటికీ ఉంచుకోవాల్సిన అవసరం లేదు” అనుకునేవారికి సబ్స్క్రిప్షన్ ఆసక్తికరమైన ఎంపిక. అంటే.. కారు కొనడం ఒక్కటే మార్గం కాదు. మీ అవసరం, వినియోగ కాలం, నెలవారీ బడ్జెట్, కారుపై యాజమాన్య హక్కుల అవసరం ఆధారంగా కొనాలా? లీజుకు తీసుకోవాలా? అనేది నిర్ణయించుకోవాలి.
కొత్త కారు మీద మోజు ఉన్నా.. భారీ ఈఎంఐల భయం ఉంటే మాత్రం, కార్ సబ్స్క్రిప్షన్ అనే మూడో మార్గం ఇప్పుడు భారతీయ వినియోగదారుల ముందుంది.