Apple Watch సాంకేతిక కొన్ని పనులు సులభతరం చేయడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కూడా కాపాడగలదని అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన నిరూపించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో, అతని చేతికి ఉన్న యాపిల్ వాచ్‌లోని ఓ ఫీచర్ అతని ప్రాణాలను కాపాడింది. దీంతో యాపిల్ వాచ్ లోని కొన్ని ఫీచర్లు అవసరానికి ఉపయోగపడడమే కాకుండా ప్రాణాలను కాపాడుతుందని నిరూపించింది. ఇంతకీ ఈ ఫీచర్ ఏంటీ? ఇది ఏం చేసింది?
ఒహాయోకు చెందిన ఇస్లాం అనే వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. అతను పడిపోయిన తర్వాత కొంతసేపు ఎలాంటి కదలిక లేకపోవడాన్ని యాపిల్ వాచ్ గుర్తించింది. సాధారణంగా వ్యక్తి స్పందించకపోతే ప్రమాదం జరిగిందని అంచనా వేసే ఈ ఫీచర్ వెంటనే అత్యవసర చర్యలను ప్రారంభించింది. ఇందులో ఉండే ఫాల్ డిటెక్షన్ ఫీచర్ మొదట వాచ్ స్క్రీన్‌పై అలర్ట్ చూపించి ఆటోమేటిక్‌గా స్థానిక అత్యవసర సేవలకు కాల్ చేసింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఇస్లాంను ఆస్పత్రికి తరలించారు.
అత్యవసర వైద్య బృందం సమయానికి చేరుకోవడంతో బాధితుడికి వెంటనే చికిత్స అందించారు. వైద్యుల పర్యవేక్షణలో అతని ఆరోగ్యం నిలకడగా మారింది. కొద్దిసేపు కూడా ఆలస్యమై ఉంటే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉండేదని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం.
యాపిల్ వాచ్‌లో ఉన్న యాక్సిలరోమీటర్, జైరోస్కోప్ వంటి అధునాతన సెన్సర్లు శరీర కదలికలను నిరంతరం పరిశీలిస్తుంటాయి. అకస్మాత్తుగా బలంగా పడిపోయినట్లు గుర్తిస్తే వాచ్ అలర్ట్ ఇస్తుంది. యూజర్ స్పందించకపోతే సుమారు ఒక నిమిషం తర్వాత ఆటోమేటిక్‌గా అత్యవసర కాల్ చేసి, నమోదైన ఎమర్జెన్సీ కాంటాక్టులకు కూడా సమాచారం పంపుతుంది.
ఈ ఫీచర్ ముఖ్యంగా వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, ఒంటరిగా నివసించే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఇతరుల సహాయం అందుబాటులో లేకపోయినా, స్మార్ట్‌వాచ్ స్వయంగా సహాయాన్ని కోరగలగడం ప్రాణాలను కాపాడే అవకాశాలను గణనీయంగా పెంచుతోంది.
ఒహాయోలో జరిగిన ఈ ఘటన స్మార్ట్ వేరబుల్స్ కేవలం ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కే పరిమితం కావని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే సాధనాలుగా కూడా మారుతున్నాయని స్పష్టం చేసింది. సరైన సమయంలో స్పందించిన యాపిల్ వాచ్ మరోసారి సాంకేతికత మానవ జీవితాలకు ఎంత విలువైనదో నిరూపించింది.