Chukka Pagadalamma: సర్పంచ్ అంటేనే దర్పం ప్రదర్శిస్తున్న రోజులు ఇవి. చుట్టూ మందీ మార్బలం, ఖరీదైన వాహనం లేకుండా అడుగు బయట పెట్టని రోజులు ఇవి. కానీ వేల మందికి ప్రజాప్రతినిధిగా సేవలందించిన ఆ మాజీ ఎమ్మెల్యే మాత్రం దినసరి కూలీగా పని చేస్తోంది. ప్రభుత్వ రేషన్, ప్రభుత్వ వైద్య సేవలతో కాలం వెళ్ళదీస్తోంది. మీరు వింటున్నది నిజమే. ఆ మాజీ ఎమ్మెల్యే పేరు చుక్కా పగడాలమ్మ. 1972-78 మధ్య శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎస్సీ రిజర్వుడ్ గా ఉన్న ఈ స్థానం అప్పట్లో విజయనగరం జిల్లా పార్వతీపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉండేది. అనూహ్యంగా చుక్కా పగడాలమ్మకు టికెట్ దక్కింది. మాజీమంత్రి లుకలాపు లక్ష్మణ్ దాస్ ఆశీస్సులతో పోటీ చేసిన ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆరేళ్లపాటు పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. కానీ ఆమె ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే అయినప్పుడు ఆమెకు 30 ఎకరాల వరకు భూమి ఉండేది. రాజకీయాల్లోకి రావడంతో భూమి హారతి కర్పూరంలా కరిగిపోయింది. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు అతి కష్టం మీద చేయాల్సి వచ్చింది. అనారోగ్యంతో రెండేళ్ల కిందట భర్త మృతి చెందాడు. దీంతో ఆమె జీవనం కష్టతరంగా మారింది. ఆస్పత్రుల్లో వైద్యానికి ఉన్నదంతా ఖర్చు పెట్టడంతో అప్పుల పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే కోటా కింద వచ్చే పెన్షన్ 30 వేల రూపాయలు ఆమెకు ఆసరాగా నిలుస్తున్నాయి. అయితే అంతకుమించి అప్పులు ఉండడంతో వడ్డీ లెక్క సరిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన పగడాలమ్మ ప్రస్తుతం సాదాసీదా జీవితం గడుపుతోంది. పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు హయాంలో ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో ఎంతో మందికి ఈమె సహకారం అందించారు. అటువంటి ఆమె ఇప్పటి ప్రభుత్వాలకు ఎన్నో అర్జీలు పెట్టుకున్న సహకారం దక్కడం లేదు. ప్రస్తుతం ఆమె శిథిలావస్థలో ఉన్న ఇంటిలో తల దాచుకుంటుంది. కనీసం ఇంటి నిర్మాణానికి సంబంధించి సాయం కూడా ఆమెకు దక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆమెకు సాయం చేసి ఆదుకోవాలని స్థానికులు కూడా కోరుతున్నారు.