YSRCP Srikakulam Politics: ఉత్తరాంధ్ర విషయంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల నాయకత్వం మార్పు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో వెనుకబడ్డారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కనీసం వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. జిల్లా కేంద్రంలో జరిగే వైసిపి కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారు. ఆయనతో పాటు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు సైతం పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. వ్యక్తిగత పనులతో పాటు వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది దాటుతున్నా కనీసం పోస్టుమార్టం చేయలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించలేదు. అయినా సరే ధర్మాన ప్రసాదరావు స్థానంలో కొత్త వారికి బాధ్యతలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నారు. ధర్మాన పై చర్యలు తీసుకుంటే, ఆయనపై వేటు వేస్తే ఆ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని వచ్చిన నివేదికలతోనే జగన్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న మంత్రి లోకేశ్
సీనియర్ మోస్ట్ లీడర్
ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ) సీనియర్ మోస్ట్ లీడర్. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లపాటు మంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ఏకధాటిగా క్యాబినెట్లో ఉండేవారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆయన సోదరుడు కృష్ణ దాస్ కు అవకాశం ఇచ్చారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు ధర్మాన ప్రసాదరావు. అయితే విస్తరణలో చివరి రెండేళ్లు ప్రసాద్ రావుకు ఛాన్స్ కల్పించారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ధర్మాన మునుపటిలా దూకుడు చూపలేదు. 2024 ఎన్నికల్లో ఓ సామాన్య టిడిపి అభ్యర్థి చేతులు 52,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు. అప్పటినుంచి ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు.
తమ్మినేని స్థానంలో కొత్త నేత..
శ్రీకాకుళం జిల్లాకు( Srikakulam district) చెందిన మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం విషయంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనను పక్కకు తప్పించి ఓ ద్వితీయ శ్రేణి నేతకు ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. తమ్మినేని సీతారాం కు వేరే బాధ్యతలు కేటాయించారు. కానీ ధర్మాన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న జిల్లా పార్టీ సమావేశం ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఆ సమావేశానికి సైతం ధర్మాన ప్రసాదరావు గైర్హాజరయ్యారు. పోనీ ఆయన కుమారుడు రామ్మోహర్ నాయుడు అయినా హాజరు అవుతారనుకుంటే ఆయన ఆచూకీ కూడా లేదు. మొన్నటి ఎన్నికల్లో తనకు బదులు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కు టికెట్ ఇవ్వాలని ధర్మాన కోరారు. అందుకు జగన్ నిరాకరించారు అన్న వార్తలు వచ్చాయి.
Also Read:జగన్ పై రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు
అప్పుడే రీఎంట్రీ?
ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. కుమారుడికి సరైన రాజకీయ వేదిక ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో సరైన నియోజకవర్గం ఎంపిక చేసుకొని.. అవకాశాలు ఇచ్చే రాజకీయ పార్టీని ఎంచుకొని పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని ధర్మాన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆయన ప్రధాన అనుచరులతో పాటు ఆయన అభిమానులంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. చాలా యాక్టివ్ గా తిరుగుతున్నారు. అందుకే ధర్మాన ప్రసాదరావు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావును పక్కన పెడితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందని నిఘవర్గాల హెచ్చరిక ఉన్నట్లు కూడా సమాచారం. మొత్తానికైతే ధర్మాన విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.