YS Sharmila : కాంగ్రెస్ అంటే వైయస్సార్.. వైయస్సార్ అంటే కాంగ్రెస్ అనే రేంజ్ లో పరిస్థితి ఉండేది. టిడిపి ధాటికి ఏపీలో అచేతనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపింది రాజశేఖర్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ సైతం రాజశేఖర్ రెడ్డి కి విపరీతంగా స్వేచ్ఛ ఇచ్చి ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేసింది.అందుకే కాంగ్రెస్ నాయకత్వం అంటే అంచెలంచల విశ్వాసంతోముందుకు సాగారు రాజశేఖర్ రెడ్డి.కానీ ఆయన అకాల మరణంతో ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. కాంగ్రెస్ పార్టీ సైతం ఆ కుటుంబాన్ని వద్దనుకుంది. అన్నపై విపరీతమైన అభిమానంతో షర్మిల సైతం కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
తాజా ఎన్నికల్లో వైసిపి ఓడిపోయింది. షర్మిల సైతం సోదరుడు జగన్ ఓటమికి కృషి చేశారు. అయితే ఇద్దరు భిన్న ధ్రువాలుగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి వారసత్వం కోసం ఫైట్ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా రాజశేఖర్ రెడ్డిని జగన్ పట్టించుకోవడం మానేశారు. సాక్షి టీవీ ఛానల్ లోగో సమీపంలో ఉండే రాజశేఖర్ రెడ్డి ఫోటోను తీసేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ చేర్చారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో సైతం వైయస్ ప్రస్తావన లేకుండా పోతోంది. అదే సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను సొంతం చేసుకునే పనిలో పడ్డారు షర్మిల. జూలై 8న వైయస్సార్ జయంతి జరగనుంది. ఈ వేడుకలను నిర్వహించాలని అనుకోవడం లేదు వైసిపి. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ అధికారంలోకి ఉండడంతో అధికారికంగా నిర్వహించారు. ప్రభుత్వ ధనంతో వేడుకలు జరిపారు. ఇప్పుడు సొంత ధనం ఖర్చు పెట్టాల్సి ఉండడంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
అయితే ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని షర్మిల స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. అందుకు జాతీయ నేతలను ఆహ్వానించాలని షర్మిల డిసైడ్ అయ్యారు. ఇంతకుముందే హై కమాండ్ నుంచి అనుమతి తెచ్చుకున్నారు. తెలంగాణలో షర్మిల సొంత పార్టీ పెట్టారు. అప్పట్లో కూడా హైదరాబాదులో ఒకసారి సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. వైయస్ అభిమాన నేతలు చాలామంది వెళ్లారు. వైసీపీ నుంచి ఎవరూ వెళ్లకుండా జగన్ జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు షర్మిల భారీ ఏర్పాట్లు చేస్తుండడం.. కాంగ్రెస్ అధినేతలు వస్తుండడంతో.. వైసీపీలోని వైయస్ అభిమాన నేతల్లో ఒక రకమైన కదలిక రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. వైసిపి ఘోర ఓటమితో నైరాశ్యంలో ఉన్న నేతలకు కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాధీపంలా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.