YS Sharmila: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )మరోసారి వెనుకబడ్డారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ఆయన గైర్హాజరైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం వెళ్ళింది. అయితే ఆయన తాడేపల్లిలో ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రారంభోత్సవం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అమరావతి టెండర్లను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపైనే ఎక్కువగా మండిపడుతున్నారు. ప్రధాని మోదీ విషయంలో విమర్శలు చేయడానికి అసలు ఇష్టపడడం లేదు. అదే సమయంలో మోడీ మాత్రం ఈ రాష్ట్రానికి గ్రహణం వదిలింది అంటూ జగన్మోహన్ రెడ్డి పై పరోక్ష విమర్శలు చేశారు. అయినా సరే జగన్ నోరు మెదపకపోవడం విశేషం. అయితే ఈ విషయంలో షర్మిల మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
Also Read: సాక్షిలో కనిపించని అమరావతి ప్రకటనలు!
* కూటమి టార్గెట్..
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( AP Congress chief Sharmila ) ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఆయన చేతుల మీదుగా అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయించారు. ఏపీ అభివృద్ధికి తాను అండగా నిలబడతానని.. అమరావతిని ఆదుకుంటామని.. మూడేళ్లలో అమరావతిని చంద్రబాబు నిర్మిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. అయితే అమరావతికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. ప్రధాని మోదీ తీరు చిచ్చుబుడ్డి తుస్సుమన్నట్లు తయారయిందని షర్మిల ఎద్దేవా చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని తేల్చి చెప్పారు. అసలు ఏపీ రాజధాని కి ప్రధాని మోదీ ఏం ఇచ్చారని ప్రశ్నించారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
* టిడిపి పట్ల సానుకూలత..
ఆది నుంచి షర్మిల టిడిపి కూటమి( TDP Alliance parties) విషయంలో సానుకూలంగానే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో టిడిపికి అనుకూలత తేవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయనపై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యారు షర్మిల. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సైతం టార్గెట్ చేశారు. అయితే ఇటీవల షర్మిల తీరులో మార్పు కనిపిస్తోంది. బిజెపితో స్నేహాన్ని కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేయక తప్పలేదు. అదే సమయంలో ప్రధాని మోడీతోపాటు బిజెపిపై విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. కానీ షర్మిల మాత్రం విరుచుకుపడుతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి బిజెపిపై విమర్శలు చేయడం లేదని.. సంకేతాలు పంపేలా షర్మిల విమర్శలు ఉన్నాయి.
* ఘాటైన విమర్శలతో..
అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయిన వేళ.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. 2017లో రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారని.. నేడు ముఖాన సున్నం కొట్టి వెళ్లారని షర్మిల ధ్వజమెత్తారు. పదేళ్ల కిందట ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్దాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారని మండిపడ్డారు. మళ్లీ అభివృద్ధి చేస్తాం.. భుజాలు కలుపుతాం అంటూ బూటకపు మాటలు చెప్పారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనపై పరోక్ష ఆరోపణలు చేసిన ప్రధాని మోదీపై జగన్మోహన్ రెడ్డి పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. కానీ షర్మిల మాత్రం ఇచ్చి పడేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాస్త దిగాలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తండ్రి షర్మిల బెటర్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.