YCP : కడప.. ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది వైఎస్సార్ కుటుంబం( YSR family). ఉమ్మడి రాష్ట్రంలో సైతం కడప జిల్లాను టచ్ చేసేందుకు రాజకీయ పార్టీలు భయపడేవి. వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఆ జిల్లా పై ఆయన హవా కొనసాగింది. ఆయన తర్వాత కుమారుడు జగన్మోహన్ రెడ్డి సైతం అదే దూకుడు కనబరిచారు. గల్లీ నుంచి జిల్లా వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పుచేతల్లో ఉండేది. అటువంటి కడప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయపెడుతోంది. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా నష్టపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడింట ఓడిపోయింది. చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా ఓ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. తక్కువ మెజారిటీతో కడప ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే కూటమి దూకుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విలవిలలాడిపోతోంది కడప జిల్లాలో.
Also Read : వై నాట్ కుప్పం.. ఆ స్లోగన్ ఇప్పుడు రివర్స్!
* కడప మేయర్ తొలగింపు..
కడప జిల్లాలో( Kadapa district ) కడప నగరపాలక సంస్థ గుండెకాయ లాంటిది. కడప జిల్లా కేంద్రంగా రాజకీయాలను శాసించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అటువంటి కడపలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ తొలగించబడ్డారు. నామినేటెడ్ పేరుతో కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చుకున్నారన్న ఆరోపణలతో మున్సిపల్ శాఖ ఆయనపై వేటు వేసింది. దీంతో కడపలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు పోయినట్లు అయింది. సాధారణ ఎన్నికల్లో కడప అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అప్పటినుంచి ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్టు బిగిస్తూనే ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన చివరకు కూటమిదే పైచేయి అయింది.
* మున్సిపల్ చైర్మన్ రాజీనామా..
మరోవైపు మైదకూరు( mydakuru) కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ మున్సిపల్ చైర్మన్ చంద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీకి అత్యంత విధేయుడు కూడా. కానీ ఆయన వాయిస్ వినేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. రెండుసార్లు తాడేపల్లి కి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ని కలవలేకపోయారు. మరోవైపు పార్టీలో అంతర్గత సమస్యలు పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడి భరించలేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు చంద్ర. కేవలం అధినేత చర్యలతో విసిగిపోయిన చంద్ర రాజీనామా నిర్ణయానికి వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సముదాయించారు. కానీ పార్టీలో ఉండడం అంత శ్రేయస్కరం కాదని భావించి చంద్ర రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క చంద్ర కాదు జిల్లాలో చాలావరకు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ఆ బెదిరింపు ప్రకటనలతో వైసిపికే నష్టం!
* మహానాడులో నేతల చేరిక..
మరోవైపు తెలుగుదేశం పార్టీ దూకుడుగా ఉంది. కడపలో మహానాడును నిర్వహించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరాలని చూస్తోంది. కడప జిల్లాలో పార్టీ బలోపేతం పై మహానాడులో బలమైన చర్చ జరిగే అవకాశం ఉంది. మహానాడు వేదికగా కొంతమంది నేతలను చేర్చుకునే పనిలో టిడిపి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తితో ఉన్నట్లు ఎప్పటినుంచో ప్రచారం ఉంది. మరి అటువంటి నేతలు మహానాడు వేదికగా టిడిపిలో చేరుతారా? అనే చర్చ అయితే మాత్రం జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో?