YCP: వై నాట్ కుప్పం( why not Kuppam) అంటూ హడావిడి చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని శపధం చేశారు. అంతటితో ఆగకుండా కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో అడ్డుకున్నారు కూడా. ఒకానొక దశలో దాడి చేసిన ప్రయత్నం చేశారు. అటువంటి కుప్పంలో ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు కూడా పడరాని పాట్లు పడుతోంది. కుప్పంలో స్థానిక సంస్థలతోపాటు మున్సిపాలిటీని గెలిచేసరికి చంద్రబాబును సైతం ఓడిస్తామంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వాయి. అక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ భరత్ ను ఎమ్మెల్సీగా చేసేసరికి ఆయన నేనే ఎమ్మెల్యేను అన్నంత రేంజ్ లో విరుచుకుపడ్డారు. వెనుకా ముందు చూసుకోలేదు. అయితే ఇప్పుడు అదే భరత్ పై తిరుగుబాటు చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. భరత్ ను నమ్ముకుంటే పార్టీ తుడుచుపెట్టుకుపోతుందని హెచ్చరించారు. హాయ్ కమాండ్ కు హెచ్చరికలు పంపారు.
Also Read: ఏపీలో ఆ 144 మండలాల్లో.. వాతావరణ శాఖ అలెర్ట్
* చంద్రబాబు మెజారిటీ తగ్గడంతో..
2019 ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేశారు భరత్. జగన్ ప్రభంజనంలో చంద్రబాబు మెజారిటీ తగ్గింది. దీంతో భరత్ ను కార్నర్ చేసుకుని రాజకీయం మొదలుపెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన పుంగనూరు కంటే కుప్పం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఇక కుప్పంలో చంద్రబాబును ఓడించడమే తరువాయి అన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి సైతం చంద్రబాబు పై భరత్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. అయితే వారు ఒకటి తలిస్తే కుప్పం నియోజకవర్గ ప్రజలు మరోలా తలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తుడుచుపెట్టుకుపోయింది.
* కనిపించని ఎమ్మెల్సీ భరత్
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గంలో కనిపించకుండా మానేశారు. ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నారు. ఈ తరుణంలో నియోజకవర్గంలోని శాంతిపురం జడ్పిటిసి సభ్యుడు శ్రీనివాసులు, సీనియర్ నేత ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి భరత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భరత్ తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయారని విమర్శించారు. టిడిపికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. భజన పరులకి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేతలు. అయితే వెంటనే స్పందించిన భరత్ శాంతిపురం జడ్పిటిసి సభ్యుడు శ్రీనివాసులతో పాటు సీనియర్ నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యలు తీసుకున్నామని చెప్పారు.
* వైసిపి విలవిల..
ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది. కనీసం పార్టీ వాయిస్ వినిపించేవారు కూడా కరువు అవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కుప్పంలో ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో తెలియనిది కాదు. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వెళ్లిన చంద్రబాబుపై దాడి చేసినంత పనిచేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కి దారుణంగా అవమానించారు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాక వికలం అయింది. ఉనికి చాటుకునేందుకు కూడా ఇబ్బంది పడుతోంది.