YCP Krishnam Raju: మద్యం కుంభకోణంలో దర్యాప్తు బృందం వేగంగా అడుగులు వేస్తోంది. తిరుపతి నెయ్యి కల్తీ వ్యవహారంలోనూ సిట్ సంచలన నివేదిక వెల్లడించింది. మొత్తంగా చూస్తే ఏ పరిణామం కూడా ఫ్యాన్ పార్టీకి అనుకూలంగా లేదు. ఇలాంటి సందర్భంలో ఫ్యాన్ పార్టీ వేసే అడుగు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాట.. తీసుకునే నిర్ణయం అత్యంత పకడ్బందీగా ఉండాలి. ఇటీవల నిర్వహించిన వెన్నుపోటు దినం కాస్త కేడర్లో ఉత్సాహాన్ని నింపింది. అదే టెంపో కొనసాగిస్తే తిరుగుండదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమయింది. ఇక ఇలాంటి సందర్భంలో పార్టీకి మౌత్ పీస్ లాగా ఉన్న సాక్షి మరింత పకడ్బందీగా ఉండాలి. ముఖ్యంగా అధికార కూటమికి అనుకూలంగా ఉన్న చానల్స్, పత్రికలను ఎదుర్కోవాలి. కానీ సాక్షి చేసిన ఒక చిన్న తప్పు.. డిబేట్లో దొర్లిన ఒక తప్పుడు మాట మంటలు పుట్టిస్తోంది.
Also Read: ప్రభాస్ ని నేను బావ అని పిలుస్తుంటాను..అతను లేకుంటే కన్నప్ప లేదు – మోహన్ బాబు
ఇటీవల అమరావతిని దేవతల రాజధాని అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో సాక్షి ఛానల్ నిర్వహించిన డిబేట్లో కృష్ణంరాజు అనే జర్నలిస్టు.. అనకూడని మాట అన్నాడు. ఏ మహిళ కూడా భరించలేని వ్యాఖ్య చేశాడు. వాస్తవానికి అసలు చేసిన వ్యాఖ్యలకు, వైసిపి మౌత్ పీస్ కు ఎటువంటి సంబంధం లేకపోవచ్చు. కాకపోతే అటువంటి వ్యాఖ్యలను బాధ్యతాయుతమైన వ్యాఖ్యాత స్థానంలో కూర్చున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించాలి. వాటిని తప్పు పట్టాలి. పైగా ఆ వ్యాఖ్యలకు , తమ ఛానల్ కు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రకటన చేయాలి. కానీ కృష్ణంరాజు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ” అవునవును నేను కూడా ఇంగ్లీష్ పత్రికల్లో చూశాను” అన్నట్టుగా వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా దుమారం రేగింది.
అసలే అదును కోసం చూస్తున్న కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా రెచ్చిపోయింది. ఇక నిన్నటి నుంచి డిబేట్లు, ప్రత్యేకమైన వార్తలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. ఇక నిన్న ప్రైమ్ టైం లో అయితే కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా చానల్స్ మొత్తం సాక్షి మీద టన్నులకు టన్నులు దుమ్ము ఎత్తిపోశాయి. ఇక జరిగిన నష్టాన్ని ఆలస్యంగానే గుర్తించిన సాక్షి మేనేజ్మెంట్ మొత్తానికి ఒక ప్రకటన చేసింది. జరిగిన దాంతో మాకు సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చపడేసింది. సందట్లో సడే మియాగా వైసిపి కూడా స్పందించింది. జరిగినదానిని తమ పార్టీకి ఆపాదించకూడదని పేర్కొంది.. కానీ ఇక్కడే అటు సాక్షి, వైసిపి అసలు విషయాలు మర్చిపోతున్నాయి. వైసిపి మౌత్ పీస్ సాక్షి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పైగా సాక్షిని వైసీపీ నాయకులు ఎంతగా ఓన్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిన ఘటనపై తమకు సంబంధం లేదని సాక్షి.. తమ ప్రస్తావన తీసుకురావద్దని వైసిపి.. వేరువేరుగా ప్రకటనలు చేయడం విశేషం. అన్నట్టు వైసిపి నేతలు చేసిన ప్రకటనలు సాక్షిలో మాత్రమే ప్రచురితం కావడం మరింత విశేషం.